5 ఏళ్ల లోపు బాలల్లో 27 శాతం మందికి పోషకాహార లోపం

ప్రపంచంలో అయిదేళ్లలోపు వయసు బాలల్లో 27 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వారిలో అత్యధికులు ఆఫ్రికా ఖండ దేశాల్లోనే ఉన్నారని ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ యూనిసెఫ్‌ తెలిపింది.

Updated : 07 Jun 2024 06:36 IST

20 ఆహార దారిద్య్ర దేశాల్లో 13 ఆఫ్రికాలోనే 
యూనిసెఫ్‌ నివేదిక వెల్లడి

కాల్టుంగో (నైజీరియా): ప్రపంచంలో అయిదేళ్లలోపు వయసు బాలల్లో 27 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వారిలో అత్యధికులు ఆఫ్రికా ఖండ దేశాల్లోనే ఉన్నారని ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ యూనిసెఫ్‌ తెలిపింది. 100 అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోని బాలల స్థితిగతులను పరిశీలించి ఈ సంస్థ గురువారం నివేదిక విడుదల చేసింది. రోజులోనో, రెండు రోజుల్లోనో కనీసం ఒక్క పూట కూడా సరైన ఆహారానికి నోచుకోనివారెందరో ఉన్నారని వెల్లడించింది. ఇలాంటి ఆహారపరమైన దారిద్య్రానికి లోనైన 20 దేశాల్లో 13 ఆఫ్రికాలోనే ఉన్నాయి. ప్రపంచంలో అయిదేళ్ల లోపు వయసువారిలో 27 శాతం మంది (18.1 కోట్ల మంది) ఆహార దారిద్య్రంతో బాధపడుతున్నారు. ఆఫ్రికాలో పలు దేశాల్లో సాయుధ సంఘర్షణల వల్ల పెద్ద సంఖ్యలో జనం నిర్వాసితులవుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గిపోయి పంటలు పండటం లేదు. ఫలితంగా ఆహార ధరలు పెరిగి, ఆఫ్రికాలో బాలబాలికలు ఆహార దారిద్య్రం బారిన పడుతున్నారు. తినడానికి తిండి లేక కృశించిపోతున్నారు. ఈ సమస్య తీవ్రమైతే బాలలు మరణించే ప్రమాదం 12 రెట్లు ఎక్కువ. ప్రోటీన్‌ లోపంతో వచ్చే క్వాషియోర్కర్‌ వ్యాధి చాలామందిని బలిగొంటోంది. పోషకాహార లోపం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరచి పలు వ్యాధులకు లోనయ్యేట్లు చేస్తుంది. తీవ్ర ఆహార కొరతతో చాలామంది ఆఫ్రికా ప్రజలు ఆకులు, అలములను, మిడతలను తిని కడుపు నింపుకొంటున్నారు. నైజీరియా, సూడాన్‌లలో చాలామంది బాలలు ఆహారం లేక మరణిస్తున్నారు. ఆఫ్రికాలో అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన దక్షిణాఫ్రికా ప్రపంచంలో అత్యంత అసమానతలకు ఆలవాలం కూడా. ఇక్కడ ప్రతి నలుగురు బాలల్లో ఒకరు ఆహార దారిద్య్రానికి గురవుతున్నారు.

ఫలిస్తున్న యూనిసెఫ్‌ కృషి

ఈ దుర్భర పరిస్థితిని అధిగమించడానికి యూనిసెఫ్‌ కృషి మొదలుపెట్టింది. నైజీరియాలో సొంత పెరళ్లలోనే చిలగడ దుంప, కర్ర పెండలం, మొక్కజొన్న, చిరు ధాన్యాలు, కూరగాయల పెంపకంలో వేలాది మహిళలకు శిక్షణ ఇస్తోంది. వర్షాలు విఫలం కావడంతో ఇసుక సంచుల్లో ఈ మొక్కల పెంపకాన్ని నేర్పుతోంది. కోళ్లు, పశువుల పెంపకంలో మెళకువలనూ నేర్పుతోంది. పంటల వైవిధ్యీకరణ, ఆరోగ్య సేవకుల పనితీరుతో ప్రోత్సాహకాలను ముడిపెట్టడం వంటి విధానాల వల్ల పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాలలో గడచిన పదేళ్లలో ఆహార దారిద్య్రంతో బాధపడుతున్న బాలల సంఖ్య 42 శాతం నుంచి 32 శాతానికి తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని