Killings: 34మందిని కాల్చి చంపిన ఆ నరహంతకుడు ఆత్మహత్య!

థాయిలాండ్‌లోని డే కేర్‌ సెంటర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమం సృష్టించిన నరహంతకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 07 Oct 2022 01:34 IST

బ్యాంకాక్‌: థాయిలాండ్‌లోని డే కేర్‌ సెంటర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమానికి తెగబడిన నరహంతకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాక్లాంగ్‌ జిల్లా నాంగ్‌బు నాంఫూ పట్టణంలోని ఓ డే కేర్‌ సెంటర్‌లో బహిరంగ కాల్పులు జరిపిన పాన్య ఖమ్రాఫ్‌ అనే మాజీ పోలీస్‌ అధికారి ఆ తర్వాత కుటుంబాన్ని కూడా చంపి తర్వాత బలవన్మరణానికి పాల్పడినట్టు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ రోజు మధ్యాహ్న సమయంలో డే కేర్‌ సెంటర్‌లోకి ప్రవేశించిన నిందితుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 23మంది చిన్నారులతో పాటు మొత్తం 34మంది మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో రెండేళ్ల వయసు చిన్నారులే ఎక్కువ మంది ఉండటం అందరినీ హృదయాలను తీవ్రంగా కలచిస్తోంది.

ఈ ఘటనలో ఎనిమిది మాసాల గర్భిణిగా ఉన్న ఓ టీచర్‌తో పాటు నలుగురైదుగురు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి జిల్లా అధికారి జిడపా బూన్సమ్‌ వెల్లడించారు. ఇప్పటివరకు 26మంది మృతదేహాలను గుర్తించామని.. వీరిలో 23మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు, ఒక పోలీస్‌ అధికారి ఉన్నట్టు ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ప్రధాని కూడా అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, ఈ మారణహోమానికి తెగబడిన అనంతరం ఘటనా స్థలం నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకున్న నిందితుడు తన భార్య పిల్లల్ని కూడా చంపేసి ఆ తర్వాత  ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని