Pakistan: పాకిస్థాన్‌లో సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..!

పాకిస్థాన్‌లో సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి జరిగింది. 

Updated : 17 Mar 2024 19:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాయువ్య పాకిస్థాన్‌(Pakistan)లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఉత్తర వజీరిస్థాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఏకంగా సైనిక స్థావరంపైనే ఆత్మాహుతి దాడి చేశారు. భారీగా పేలుడు పదార్థాలను అమర్చిన వాహనంతో సైనిక పోస్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో పలువురు సైనికులు చనిపోయారు. ఆ తర్వాత భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. వారిలో కొందరు బాంబులు అమర్చిన ఆత్మాహుతి దాడి జాకెట్లను ధరించినట్లు గుర్తించారు. కొత్తగా ఏర్పాటు చేసిన జైషే ఫురాసనే మహమ్మద్‌ సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. అనంతరం చోటు చేసుకొన్న కాల్పుల్లో ఇద్దరు ఆఫీసర్లు చనిపోయినట్లు పాక్‌ సైన్యం వెల్లడించింది. మిలటరీ పోస్టు కూడా ఒక వైపు పూర్తిగా కూలిపోయిందని తెలిపింది. ఈ దాడిని పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసీఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఖండించారు. ఉత్తర వజీరిస్థాన్‌ చాలా ఏళ్లుగా పాక్‌ తాలిబన్లు సహా పలు ఉగ్ర సంస్థలకు కీలక కేంద్రంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని