Ukraine: ఖేర్సన్‌లో దాడి.. 23 రోజుల శిశువు సహా ఏడుగురు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోగా.. వీరిలో 23 రోజుల చిన్నారి కూడా ఉంది.

Published : 14 Aug 2023 01:47 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) రష్యా జరుపుతోన్న దాడుల్లో అనేక మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా ఉక్రెయిన్‌ దక్షిణ భాగంలోని ఖేర్సన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు చనిపోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోగా.. వీరిలో 23 రోజుల శిశువు కూడా ఉండటం కలచివేస్తోంది.

నైపర్‌ నది తీరంలో ఉన్న శిరోకా బాల్కా గ్రామంపై రష్యా సేనలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన భర్త, భార్య, 12ఏళ్ల అబ్బాయి, 23 రోజుల పసికందుతోపాటు మరో స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. దానికి ఆనుకొని ఉన్న మరో గ్రామంలోనూ ఇద్దరు చనిపోయారు. ఇక దక్షిణ ప్రాంతంలో ఉక్రెయిన్‌ సేనలు పైచేయి సాధించాయని ఉక్రెయిన్‌ సైనిక అధికారులు శనివారం ప్రకటించారు. దీంతోపాటు జపోరిజియాతో సహా మరికొన్ని ప్రదేశాలను పాక్షికంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఖేర్సన్‌పై రష్యా దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మరోవైపు కొంతకాలంగా రష్యాపై ప్రతిదాడులకు దిగుతోన్న ఉక్రెయిన్‌.. పాశ్చాత్య దేశాలు అందించిన డ్రోన్లను వినియోగిస్తోంది. ముఖ్యంగా మే నెలలో రష్యా అధ్యక్ష భవనంపై దాడికి యత్నించినప్పటి నుంచి డ్రోన్ల వినియోగం మరింత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బెల్గొరాడ్‌, కుర్క్స్‌ ప్రాంతాలపై ఒక్కొకటి చొప్పున డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు రష్యా వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు