Russia- Ukraine War: 500 రోజులు.. 9 వేలకుపైగా పౌర మరణాలు.. 63 లక్షల మంది శరణార్థులు!

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధానికి 500 రోజులు పూర్తయ్యింది. ఇప్పటివరకు తొమ్మిది వేల మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస తాజాగా అంచనా వేసింది.

Updated : 08 Jul 2023 19:27 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టి 500 రోజులు పూర్తయ్యింది. గత ఏడాది ఫిబ్రవరి 24న ‘ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌’ పేరిట మాస్కో దాడులు మొదలుపెట్టగా.. ఇప్పటికీ యుద్ధం (Russia- Ukraine war) ముగింపు దిశగా ఎటువంటి సంకేతాలు కనిపించడం లేదు. మరోవైపు.. రష్యా (Russia) సేనల భీకర దాడులతో ఉక్రెయిన్‌ (Ukraine)లో ఆస్తి, ప్రాణ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో మాస్కో దూకుడు కనబర్చినా.. ఆ తర్వాత కీవ్‌ సైతం పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో ఎదురుదాడులకు దిగుతోంది.

ఈ క్రమంలోనే ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు తొమ్మిది వేల మందికిపైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస (UN) తాజాగా వెల్లడించింది. మృతుల్లో 500 మంది చిన్నారులు ఉన్నట్లు ఉక్రెయిన్‌లో ఐరాస మానవ హక్కుల పర్యవేక్షణ మిషన్‌ (HRMMU) తెలిపింది. వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని పేర్కొంది. యుద్ధంలో పౌర మరణాలను తీవ్రంగా ఖండించింది. 2022తో పోలిస్తే ఈ ఏడాది మృతుల సంఖ్య సగటు తక్కువగా ఉన్నప్పటికీ.. మే, జూన్‌లలో మళ్లీ పెరగడం ప్రారంభించిందని తెలిపింది.

ఈ యుద్ధంలో ఇరువైపులా వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యపై అటు రష్యాగానీ, ఇటు ఉక్రెయిన్‌గానీ ఇప్పటివరకు నిర్దిష్ట ప్రకటన చేయలేదు. అయితే, జులై 7 నాటికి 2.32 లక్షల మంది రష్యన్‌ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు.. 63 లక్షల మంది ఉక్రెనియన్లు శరణార్థులుగా మారినట్లు ఐరాస అంచనా వేసింది. 60 లక్షల మంది నిరాశ్రయులయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ భూభాగంలో దాదాపు 17 శాతం వరకు రష్యా ఆక్రమణలో ఉన్నట్లు అంచనా.

ఇదిలా ఉండగా.. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి తూర్పు వైపుగా విస్తరణను వ్యతిరేకిస్తోన్న రష్యా అధినేత పుతిన్‌.. ఉక్రెయిన్‌ను అందులో చేర్చుకునే ప్రయత్నాన్ని నిలువరించే క్రమంలో ఆ దేశంపై సైనిక చర్య ప్రారంభించిన విషయం తెలిసిందే. పేరుకు రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధమే అయినా.. ప్రస్తుతం నాటో- రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలా తయారైంది. రష్యాపై ఎదురుదాడులకు వీలుగా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు భారీఎత్తున ఆయుధ సాయం అందిస్తున్నాయి. తాజాగా అమెరికా ‘క్లస్టర్‌ బాంబు’లను అందజేస్తామని ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని