Suneung: పరీక్షలో 90 సెకన్ల ముందే బెల్‌ కొట్టారని.. విద్యార్థుల దావా

Suneung Test: ఓ ప్రవేశ పరీక్ష కోసం కేటాయించిన సమయం కంటే ముందే బెల్‌ కొట్టడంపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై దావా వేశారు. 

Updated : 20 Dec 2023 20:39 IST

సియోల్‌: యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం దక్షిణ కొరియా (South Korea) నిర్వహించే ‘సన్‌అంగ్‌’ (Suneung) అనే ప్రవేశపరీక్ష ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.  ఒకే రోజు ఎనిమిది గంటల పాటు జరిగే ఈ పరీక్ష..  పలు సబ్జెక్టుల్లో విద్యార్థుల నైపుణ్యాలను విశ్లేషిస్తుంది. అయితే మొదటి పేపర్‌ పరీక్ష సమయం పూర్తికాకముందే బెల్‌ కొట్టారని.. సియోల్‌ నగరంలోని ఓ పరీక్షా కేంద్రంలోని 39 మంది విద్యార్థులు దావా వేశారు.

90 సెకన్ల ముందే బెల్‌ కొట్టడంపై విద్యార్థులు పరీక్షా కేంద్రంలోనే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమయానికి ముందే ఇన్విజిలేటర్‌ తమ పేపర్లు తీసుకున్నారని వారు ఆరోపించారు. తర్వాత పొరపాటు గుర్తించి తమ పేపర్లు తిరిగి ఇచ్చారని, అయితే అప్పటికే రాసిన సమాధానాలు మార్చడానికి మాత్రం అనుమతించలేదన్నారు. పూర్తి చేయని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి మాత్రమే సమ్మతించారని తెలిపారు. దాంతో తాము వేదనకు గురయ్యామని, అదే రోజు ఉన్న తర్వాత పరీక్షలపై దృష్టి సారించలేకపోయామని వాపోయారు. కొంతమంది మిగతా పరీక్షలు పూర్తిచేయకుండానే వెళ్లిపోయినట్లు సమాచారం.

ఈ క్రమంలో 39 మంది విద్యార్థులు ప్రభుత్వంపై దావా వేశారు. ఒక్కొక్కరికి 20 million won (15400 డాలర్లు) చెల్లించాలని డిమాండ్ చేశారు. మళ్లీ వచ్చే ఏడాది పరీక్ష రాయడానికి అయ్యే ఖర్చు దృష్టి పెట్టుకొని ఇంతమొత్తం కోరారు. త్వరగా పరీక్ష ముగించిన ఘటనపై ఇప్పటివరకు విద్యాశాఖ క్షమాపణలు చెప్పలేదని విద్యార్థుల తరఫు న్యాయవాది మీడియాకు వెల్లడించారు. ఆ పరీక్షా కేంద్రం నిర్వాహకుడు సమయాన్ని తప్పుగా చూడటం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ షాక్‌!.. కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆ దేశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2021లో  రెండు నిమిషాల ముందు బెల్‌ కొట్టిన ఘటనలో విద్యార్థులకు 7మిలియన్ల వోన్‌ చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. చైనాలో అయితే నాలుగు నిమిషాల 48 సెకన్ల ముందు బెల్‌ కొట్టినందుకు..ఓ పరీక్షా కేంద్రం సూపర్‌వైజర్‌ ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు.

దక్షిణ కొరియా(South Korea)లో పన్నెండో తరగతి పాసైన విద్యార్థులు యూనివర్సిటీల్లో చేరడానికి ‘సన్‌అంగ్‌’ (Suneung) అనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా నవంబరులో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు భారీ పోటీ ఉంటుంది. ఒకేరోజు ఎనిమిది గంటలపాటు జరిగే ఈ పరీక్షకు దాదాపు 5లక్షల మంది హాజరవుతుంటారు. కొరియా బాషతో పాటు ఇంగ్లిష్‌, గణితం, చరిత్ర, సైన్సు తదితర సబ్జెక్టుల్లో విద్యార్థుల నైపుణ్యాలను విశ్లేషించే ప్రశ్నలుంటాయి. కేవలం కాలేజీ భవితనే కాకుండా కెరీర్‌, వివాహం వంటి విషయాల్లోనూ ఈ పరీక్ష కీలక పాత్ర వహిస్తుందట. దాంతో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తారు.

ఇక, సన్‌అంగ్‌ పరీక్ష జరిగే రోజున దేశం మొత్తం నిశ్శబ్దంగా మారుతుంది. టీవీలూ మ్యూజిక్‌ సిస్టమ్స్‌ మూగబోతాయి. రోడ్లమీద ట్రాఫిక్‌ విద్యార్థులకు అడ్డం రాకూడదని కోర్టులు, బ్యాంకులు, స్టాక్‌మార్కెట్‌తో సహా కార్యాలయాలన్నింటినీ కొద్దిపాటి సిబ్బందితో ఆలస్యంగా ప్రారంభించి త్వరగా మూసేస్తారు. భాషకి సంబంధించిన పరీక్షలో విని రాయాల్సింది ఉంటుంది. అందుకని వారి ఏకాగ్రతకు భంగం కలగకుండా చూడడానికి దేశమంతటా విమానాల రాకపోకల్ని నిలిపేస్తారు. మిలిటరీ శిక్షణ, నిర్మాణ పనులనూ ఆపేస్తారు. విద్యార్థుల కోసం బస్సులు, ట్యాక్సీలను ఉచితంగా నడుపుతారు. పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలు కూడా విద్యార్థుల భద్రత కోసం అందుబాటులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని