Cannes: కేన్స్‌లో మళ్లీ ఉక్రెయిన్‌ అలజడి.. ఒంటిపై ‘రక్తం’తో మహిళ నిరసన

కేన్స్‌ సినీ ఉత్సవం (Cannes Film Festival)లో ఓ మహిళ అలజడి సృష్టించింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిరసన చేపట్టిన ఆమె.. శరీరానికి నకిలీ రక్తం రాసుకుని భయభ్రాంతులకు గురిచేసింది. 

Updated : 05 Jan 2024 15:11 IST

కేన్స్‌: ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival)లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) సాగిస్తున్న దండయాత్రను నిరసిస్తూ ఓ మహిళ కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై ఆందోళనకు దిగింది. ఉక్రెయిన్‌ జెండా రంగులున్న దుస్తులను ధరించి వచ్చిన ఆమె.. ఒక్కసారిగా రక్తాన్ని తలపించేలా ఎరుపు రంగును తన ఒంటిపై పోసుకుని నిరసన ప్రదర్శించింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు.

76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes Film Festival)లో భాగంగా గత ఆదివారం ‘ యాసిడ్‌’ సినిమా ప్రీమియర్‌ జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఎర్రతివాచీపై నిలబడి వరుసగా ఫొటోలకు పోజులిచ్చారు. అదే సమయంలో ఓ మహిళ ఉక్రెయిన్‌ (Ukraine) జెండా రంగులైన నీలం, పసుపు వర్ణంలోని దుస్తులతో రెడ్‌కార్పెట్‌పైకి నడుచుకుంటూ వచ్చింది. కేన్స్‌ మెట్లపై ఫొటోలకు పోజులిచ్చింది. అనంతరం తన వెంట తీసుకొచ్చిన బాటిల్‌ను తెరిచి అందులోని ఎరుపు రంగుని తన తలపై పోసుకుని శరీరమంతా రాసుకుంది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ మహిళను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.

రష్యా (Russia) సాగిస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నెత్తుటి దారులు ఏరులై పారుతున్నాయనడానికి సంకేతంగా ఆ మహిళ ఇలా నకిలీ రక్తంతో నిరసన ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై కేన్స్‌ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. సదరు మహిళ ఎవరన్నది కూడా తెలియరాలేదు. ఉక్రెయిన్‌ దేశస్థురాలిగా అనుమానిస్తున్నారు.

కాగా.. కేన్స్‌ (Cannes)లో గతేడాది కూడా ఓ మహిళ ఇలాగే అనూహ్యంగా నిరసనకు దిగి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధం పేరుతో అక్కడి మహిళలపై రష్యా సైనికులు సాగిస్తోన్న అకృత్యాలను నిరసిస్తూ ఆ మహిళ.. దుస్తులు చించేసుకుని అర్ధనగ్నంగా నిరసన చేపట్టింది. ఆమె ఛాతీ భాగంపై ‘‘Stop raping us” అనే సందేశం ఉక్రెయిన్‌ జెండా రంగులైన నీలం, పసుపు రంగు పెయింట్‌లో కనిపించింది. ‘‘మమ్మల్ని రేప్‌ చేయొద్దు’’ అంటూ గట్టిగా అరిచింది. దీంతో భద్రతా సిబ్బంది ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు.

గతవారం కేన్స్‌ సినీ ఉత్సవం (Cannes Film Festival) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కేన్స్‌ డైరెక్టర్‌ థిర్రీ ఫ్రెమాక్స్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు తాము అండగా ఉంటామని మరోసారి ప్రకటించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రష్యా ప్రతినిధులు, ఫిల్మ్‌ కంపెనీలపై కేన్స్‌ నిషేధం విధించారు. గతేడాది కేన్స్‌ ఉత్సవాల ప్రారంభోత్సవంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రత్యేక ప్రసంగం చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని