GPS Spoofing: దారి తప్పుతున్న విమానాలు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?

GPS Spoofing: విమానాల నావిగేషన్‌ వ్యవస్థను సైతం ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్‌ ద్వారా దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్‌ సిగ్నల్‌ స్పూఫింగ్‌ (GPS Signals spoofing)గా వ్యవహరిస్తారు. ఇరాన్‌లో విమానాలు దారి మళ్లడానికి ఇదే కారణమా?

Updated : 01 Oct 2023 12:39 IST

ముంబయి: విమానాలు దారి తప్పడం అత్యంత అరుదు. సాంకేతిక లోపం కారణంగా సిగ్నల్స్ స్తంభించినప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ, వెంటనే వాటిని సరిచేసి విమానం గతి తప్పకుండా చర్యలు చేపడతారు. లేదా ఏదైనా లోపం తలెత్తి అనుకోని ప్రమాదం జరిగినప్పుడు విమానం కనిపించకపోవడం అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే పరిణామాలు. కానీ, ఈ మధ్య ఇరాన్‌-ఇరాక్‌ గగనతలంలో విమానాలు తరచూ దారి తప్పుతున్నట్లు తేలింది. ఇంతకీ ఈ ఒక్క ప్రాంతంలోనే అలా ఎందుకు జరుగుతోంది? కావాలనే ఎవరైనా చేస్తున్నారా?అదే నిజమైతే దీని వెనుక ఎవరున్నారు?

దారి మళ్లిన 20 విమానాలు..

గత 15 రోజుల వ్యవధిలో దాదాపు 20 విమానాలు దారి తప్పినట్లు ఫ్లైట్‌ డేటా ఇంటెలిజెన్స్‌ వెబ్‌సైట్‌ ‘ఓపీఎస్‌ గ్రూప్‌’ ప్రకటించింది. నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ వల్లే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నావిగేషన్‌ వ్యవస్థను సైతం ఇవి ఏమార్చి విమానాలను తప్పుదోవ పట్టించేంత శక్తిమంతంగా ఈ సంకేతాలు ఉండడం ఆందోళనకరంగా మారింది. బోయింగ్‌ 777, బోయింగ్‌ 737, 747 సహా పలు ఇతర విమానాలు ఈ సిగ్నల్స్‌ బారిన పడిన వాటిలో ఉన్నాయి. ఓ బోయింగ్‌ 777 విమానంలోని పైలట్లకైతే.. అసలు వారు ఎక్కడున్నారో కూడా అర్థం కాలేదని ఓపీఎస్‌ గ్రూప్ తెలిపింది. వెంటనే వారు బాగ్దాద్‌లోని ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌’ను సంప్రదించి... ‘అసలు ఇప్పుడు సమయం ఎంత? మేం ఎక్కడున్నాం?’ అని అడిగారట! మరో ఘటనలో ఎంబ్రార్‌ లెగసీ 650 విమానం క్లియరెన్స్‌ లేకుండా ఇరాన్‌ గగనతలంలోకి ప్రవేశించింది.

భారత విమానాలూ వెళ్తుంటాయ్‌..

ఈ ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రాంతం మీదుగా భారత్‌కు చెందిన ఎయిరిండియా, ఇండిగో, విస్తారా విమానాలు సైతం తరచూ ప్రయాణిస్తుంటాయి. భారత్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో, ఇస్తాంబుల్‌, బాకు, లండన్‌కు వెళ్లే విమానాలు ఈ మార్గం నుంచే వెళతాయి. పైగా ఎయిరిండియా, ఇండిగో సంస్థలు బోయింగ్‌ 777 రకం విమానాలను నడుపుతున్నాయి. అవి ఈ మార్గం నుంచే వెళ్తుండడం గమనార్హం. అయితే, ఇవి కూడా నకిలీ జీపీఎస్‌ బారిన పడ్డాయో లేదో మాత్రం స్పష్టంగా తెలియదు.

అవిదేశాల్లో 90% ‘బిచ్చగాళ్లంతా’ పాకిస్థానీలే!

సిగ్నల్‌ స్పూఫింగ్‌..

ఇలా నావిగేషన్‌ వ్యవస్థను సైతం ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్‌ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్‌ సిగ్నల్‌ స్పూఫింగ్‌ (GPS Signals spoofing)గా వ్యవహరిస్తారు. నిజమైన శాటిలైట్‌ సిగ్నల్స్‌ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్‌ రిసీవర్‌ను తప్పుదోవ పట్టిస్తాయి. ఫలితంగా తప్పుడు లొకేషన్‌, టైమ్‌ చూపించేలా చేయడాన్నే సిగ్నల్‌ స్పూఫింగ్‌ (GPS Signals spoofing) అంటారు. ఇలాంటి ఘటనలు గత పదేళ్ల కాలంలో అడపాదడపా వెలుగులోకి వచ్చాయి. అయితే, పౌర విమానాలను ఈ స్థాయిలో టార్గెట్‌ చేయడం మాత్రం ఇదే తొలిసారి.

అమెరికా హెచ్చరికలు..

ఇరాన్‌ గగనతలం నుంచి వెళ్లే యూఎం688 ఎయిర్‌వేలో ఈ ఘటనలు జరుగుతున్నట్లు గుర్తించారు. వీటిని సీరియస్‌గా పరిగణించిన అమెరికా ‘ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA)’ ఓ మెమోను జారీ చేసింది. ‘ఇరాక్‌/అజర్‌బైజాన్‌- జీపీఎస్‌ జామింగ్‌, స్పూఫింగ్‌ భద్రతా ముప్పు’ పేరిట దీన్ని విడుదల చేసింది. అయితే, భారత్‌కు చెందిన విమానాలు యూఎం688 మార్గంలో వెళ్లడం లేదని భారత సీనియర్‌ కమాండర్‌ ఒకరు చెప్పారు. ఇరాన్‌ గగనతలం నుంచి మాత్రం కొన్ని విమానాలు వెళతాయని వెల్లడించారు. వీటిలో ఓ విమానంలో ఇటీవల సిగ్నల్‌ జామింగ్‌ ఘటన నమోదైనట్లు తెలిపారు.

సిగ్నల్‌ జామింగ్‌..

జామింగ్‌ అంత ప్రమాదకరం ఏమీ కాదని విమానయాన నిపుణులు తెలిపారు. ఇవి తరచూ జరుగుతుంటాయని వెల్లడించారు. దీన్ని వెంటనే గుర్తించవచ్చని వివరించారు. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో కూడా ఫ్లైట్‌ మాన్యువల్‌లో స్పష్టంగా ఉంటుందన్నారు. పైగా జీపీఎస్‌ కాకుండా విమాన నావిగేషన్‌ వ్యవస్థపై ఆధారపడితే జామింగ్‌ సమస్యను అధిగమించొచ్చని తెలిపారు. అదే స్పూఫింగ్‌ మాత్రం అలా కాదన్నారు. నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్ వస్తున్నాయని గుర్తించడం కష్టమన్నారు. పైగా ఫ్లైట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ నకిలీ సిగ్నల్స్‌ ఆధారంగానే ఔట్‌పుట్‌ ఇస్తుందని పేర్కొన్నారు. సాధారణంగా నావిగేషన్‌ వ్యవస్థ, జీపీఎస్‌ వ్యవస్థల్లో విమానం ఉన్న ప్రదేశం వేర్వేరుగా చూపిస్తే.. తక్షణమే జీపీఎస్‌ను ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ పైలట్లు అది గమనించకుండా అలాగే దారి తప్పితే ఏటీసీ వెంటనే అప్రమత్తమై వారిని హెచ్చరిస్తుంది. కానీ, ఎవరూ గమనించకపోతే మాత్రం ఇది పెద్ద ప్రమాదానికే దారి తీయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అసలు ఆందోళన ఇక్కడే..

తాజా ఘటనలో ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ ఏకంగా విమాన నావిగేషన్‌ వ్యవస్థను సైతం తలదన్నాయి. సాధారణంగా నావిగేషన్‌ వ్యవస్థలో విమాన లోకేషన్‌ను చూపించే ఐఆర్‌ఎస్‌ (inertial reference system).. జీపీఎస్‌ సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా ఔట్‌పుట్‌ ఇస్తుంది. కానీ, తాజా ఘటనల్లో నకిలీ సిగ్నల్స్‌ ఐఆర్‌ఎస్‌ను సైతం తప్పుదోవ పట్టించడాన్ని గమనించారు.

చైనా ఓడకు చెవులున్నాయా?

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే కారణమా?

కుర్దిస్థాన్‌ ప్రాంతంలో ఇరాన్‌, ఇరాక్‌ తమవైపు సరిహద్దుల్లో ఇటీవల భారీగా సైనిక బలగాలను మోహరించాయి. ఇరు దేశాల దగ్గర సిగ్నల్‌ జామింగ్‌, స్పూఫింగ్‌ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని ‘ఓస్ప్రే ఫ్లైట్‌ సొల్యూషన్స్‌’ ప్రతినిధి మాథ్యూ బోరీ తెలిపారు. బహుశా ఈ దేశాలే ఆ ప్రాంతంలో ఆ వ్యవస్థల్ని మోహరించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఇరాక్‌లోని ఉత్తర భాగంలో సరిహద్దుల్లో అనేక స్థావరాల్లో ఇప్పటికీ అమెరికా సేనలు ఉన్నాయి. మరోవైపు టర్కీ సైతం తమ సరిహద్దుల్లో బలగాల్ని మోహరించింది. ఈ ఇరు పక్షాల వద్ద జామింగ్‌, స్పూఫింగ్‌ వ్యవస్థలు ఉన్నట్లు బోరీ తెలిపారు.

ఇటీవల అర్మేనియా, అజర్‌బైజాన్‌తో ఉన్న సరిహద్దుల్లో ఇరాన్‌ భారీగా బలగాలను దింపింది. అర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక్కడ మూడు దేశాల వద్ద జామింగ్‌, స్పూఫింగ్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థ ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని