Israel: ఇజ్రాయెల్‌కు 6,000 మంది భారత కార్మికులు!

Israel: యుద్ధంలో మునిగిన ఇజ్రాయెల్‌ను కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్‌, మేలో భారత్‌ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు అక్కడికి చేరుకోనున్నట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.

Updated : 11 Apr 2024 11:08 IST

జెరూసలెం: హమాస్‌తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్‌ (Israel Hamas conflict) నిర్మాణ రంగాన్ని కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా భారత్‌ నుంచి 6000 మంది అక్కడికి చేరుకోనున్నారు. ఏప్రిల్‌, మేలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరిని తరలించనున్నారు. ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం రాత్రి ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

పాలస్తీనా కార్మికులు వెనక్కి వెళ్లటంతో..

స్థానికుల కొరత ఉన్నచోట ఇజ్రాయెల్‌ (Israel) నిర్మాణరంగం విదేశీ కార్మికులను నియమించుకుంటోంది. ఇప్పటి వరకు పాలస్తీనా అధీనంలోని వెస్ట్‌ బ్యాంక్‌ నుంచి 80,000, గాజాకు చెందిన 17,000 మంది అక్కడ పనిచేస్తుండేవారు. కానీ, తాజాగా ఘర్షణల నేపథ్యంలో వారికి పని అనుమతిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్‌ సహా పలు దేశాల నుంచి కార్మికులను ఆ స్థానాల్లో ఆహ్వానిస్తోంది.

హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్‌లో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. కార్మికుల కొరతే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా ఉపాధిలేక జీవన వ్యయాలు పెరిగాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాతే కార్మికుల తరలింపు నిర్ణయం వెలువడింది. భారత్‌-ఇజ్రాయెల్‌ ప్రభుత్వాల మధ్య ఒప్పందంలో భాగంగానే ఇక్కడి కార్మికులను తీసుకెళ్లనున్నారు.

20,000 మందికి అనుమతి..

గతకొన్ని నెలల్లో దాదాపు 900 మంది కార్మికులు భారత్‌ నుంచి ఇజ్రాయెల్‌ వెళ్లినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతవారం మరో 64 మంది అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక పరీక్షల తర్వాత ఇజ్రాయెలీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ దాదాపు 20,000 మంది భారత, శ్రీలంక కార్మికులకు అనుమతులు ఇచ్చిందని అక్కడి నిర్మాణ రంగం తెలియజేసింది. వారిలో కేవలం వెయ్యి మంది మాత్రమే అక్కడికి చేరుకున్నట్లు వెల్లడించాయి. కానీ, వివిధ రకాల అనుమతులు, అధికారిక పత్రాల విషయంలో జాప్యం జరుగుతోందని పీటీఐతో చెప్పాయి. ఎంపికైన వారిలో చాలా మంది శ్రామికులు తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి వేచిచూస్తున్నారని తెలిపారు. డిసెంబర్‌లో భారత ప్రధాని మోదీతో నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌కు వచ్చే భారత కార్మికులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

గత ఏడాదే చర్చలు..

భారత్‌, శ్రీలంకతో పాటు 7,000 మంది చైనా, 6,000 మంది తూర్పు ఐరోపా దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆర్థిక మంత్రి నిర్‌బర్కత్‌ భారత్‌లో పర్యటించారు. నిర్మాణం సహా వివిధ రంగాల్లో అవసరమయ్యే సిబ్బందిని ఇక్కడి నుంచి నియమించుకోవడంపై చర్చించారు. దాదాపు 1,60,000 మంది అవసరం ఉన్నట్లు అప్పట్లో వెల్లడించారు. ఇప్పటికీ ఇజ్రాయెల్‌లో 18,000 మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది కేర్‌గివర్‌గా ఉన్నారు. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. తమ భద్రతకు ఎలాంటి ముప్పు లేకపోవడం, ఆకర్షణీయమైన వేతనాల నేపథ్యంలో వారంతా అక్కడే కొనసాగుతున్నారు.

42,000 మంది కోసం మేలో ఒప్పందం..

మరోవైపు నిర్మాణ, నర్సింగ్‌ రంగంలో పనిచేసేందుకు 42,000 మంది భారతీయులను అనుమతిస్తూ గత మేలో ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. 34,000 మంది నిర్మాణ, 8,000 మంది నర్సింగ్‌ రంగంలో పనిచేస్తారని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. గత ఆరు నెలల్లో 800 మంది ఆ దేశ వ్యవసాయ రంగంలోనూ చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని