Earthquake: అఫ్గాన్‌ భూకంపం.. 1400కు పెరిగిన మృతులు

Eenadu icon
By International News Team Published : 02 Sep 2025 18:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లోని కునార్, నంగర్‌హార్‌ ప్రావిన్స్‌లను కుదిపేసిన భూకంప నష్టాల వివరాలు ఆలస్యంగా తెలుస్తున్నాయి. ఈ భూకంప విధ్వంసానికి ఊళ్లకు ఊళ్లే మాయమైనట్టు సమాచారం. ఈ విపత్తులో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1400 మందికి పైగా మరణించగా.. 3వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మానవతా సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూకంపం వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రహదారులు మూసుకుపోయాయి. దాంతో సహాయచర్యలకు ఆటంకం కలుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను రక్షించుకొనేందుకు చేతులతోనే చాలా మంది మట్టిని తవ్వితీస్తున్నారు. మరోపక్క.. తాలిబన్‌ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. రాత్రి సమయంలో భూకంపం రావడంతో చాలా మంది నిద్రలో ఉండటంతో ఇళ్ల పైకప్పులు కూలి చాలా మంది సజీవ సమాధి అయిపోయారు. భూకంప కేంద్రం కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్రత ఎక్కువగా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని