Ukraine war: ఆఫ్రికా నేతలు సందర్శిస్తున్న సమయంలో కీవ్‌పై క్షిపణి దాడులు..!

శాంతి ప్రక్రియ కోసం ఆఫ్రికా దేశాల నేతలు కీవ్‌కు చేరుకొన్న సమయంలో నగరంపై క్షిపణి దాడులు జరిగాయి. గగనతల రక్షణ వ్యవస్థ సైరన్లు నిరంతరాయంగా మోగాయి. 

Updated : 16 Jun 2023 17:06 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌-రష్యా మధ్య శాంత్రి ప్రక్రియ కోసం చర్చలు జరిపేందుకు ఆఫ్రికా దేశాల నేతలు కీవ్‌కు వచ్చిన సమయంలో భారీగా దాడులు జరిగాయి. ఈ నేతల్లో కొందరు నగరంలో ఉన్న సమయంలో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్లు నిరంతరాయంగా మోగాయి. అదే సమయంలో నల్ల సముద్రంపై నుంచి రష్యా పలు కల్బిర్‌ క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ వాయుసేన పేర్కొంది. ఇవి ఉత్తర దిశ నుంచి కీవ్‌ వైపు దూసుకొచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్‌ దౌత్యవేత్త ఒలెక్సాండర్‌ స్కెర్బా ట్వీట్‌ చేశారు. ‘‘సైరన్లు మోగుతున్నాయి. పుతిన్‌ ఆఫ్రికా నాయకులకు కీవ్‌లో స్వాగతం పలుకుతున్నారు’’ అని క్యాప్షన్‌  ఇచ్చారు. కీవ్‌లో పేలుళ్లు జరిగినట్లు నగర మేయర్‌ విటాలి పేర్కొన్నారు. తక్కువ ఎత్తులో క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయన్నారు. మొత్తం ఆరు కల్బిర్‌, ఆరు కింజల్‌ క్షిపణులతోపాటు రెండు నిఘా డ్రోన్లను తాము ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ వాయుసేన పేర్కొంది.

నేడు ఏడుగురు ఆఫ్రికా నాయకులు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీతో భేటీ అయ్యేందుకు కీవ్‌కు బయల్దేరారు. బ్రజ్జావిల్లె ఫౌండేషన్‌ అనే నాన్‌ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ ఈ కార్యక్రమం చేపట్టింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా శుక్రవారం ఉదయం నగరానికి చేరుకొన్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ ధ్రువీకరించింది. జాంబియా, ది కొమోరోస్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఈజిప్ట్‌, సెనెగల్‌, ఉగాండ నేతలు ఈ శాంతి ప్రక్రియలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ భేటీ అనంతరం వారు రేపు రష్యాకు వెళ్లనున్నారు. అక్కడ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరంలో వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ కానున్నారు.

మరో మూడు నెలల్లోపు ఆక్రమిత ప్రాంతాల్లో ఎన్నికలు..

ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో మరో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు మాస్కో వెల్లడించింది. ఇప్పటికే కీవ్‌ ఎదురు దాడులతో చాలా చోట్ల రష్యా సైనికులు వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో ఈ ప్రకటన రావడం గమనార్హం. పరిస్థితి తమ ఆధీనంలో ఉందన్న సంకేతాలు ఇచ్చేందుకే రష్యా ఈ ప్రకటన చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెనక్కి తగ్గేందుకు సిద్ధంగాలేమని ఉక్రెయిన్‌ కూడా చెబుతోంది. నిర్ణయాత్మక పోరాటాలు ముందున్నాయని కీవ్‌ వర్గాలు వెల్లడించాయి. దాదాపు ఏడాది తర్వాత ఉక్రెయిన్‌ సేనలు మరోసారి ఎదురుదాడులను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. ఉక్రెయిన్‌ దళాలు ఆక్రమించిన ప్రాంతాల్లో ధ్వంసమైన రష్యా వాహనాలు రోడ్ల పక్కన కనిపిస్తున్నాయి. ‘‘మా వీరోచిత సేనలు రష్యాను ఓడించడానికి సరిహద్దుల్లో తీవ్రంగా పోరాడుతున్నాయి. రష్యా ఓడిపోతోంది’’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని