UK flight delays: యూకే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో సమస్య.. వందల విమానాలు రద్దు..!

యూకేలోని నాట్స్‌ ఆధీనంలోని ఆటోమేటెడ్‌ ఫ్లైట్‌ ప్లానింగ్‌ సిస్టమ్‌ వ్యవస్థ మోరాయించింది. దీంతో వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు.  

Updated : 29 Aug 2023 13:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూకే(UK)లోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో తాజాగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడమో.. ఆలస్యంగా (UK flight delays) నడవడమో చోటు చేసుకొంటున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు యూకే విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. అంతేకాదు.. యూకేకు రావాల్సిన విమానాల్లో కూడా జాప్యం చోటు చేసుకోవడంతో వేలాది మంది విదేశాల్లోనే చిక్కుకుపోయారు. ఈ సాంకేతిక సమస్యను కొన్ని గంటల వ్యవధిలోనే సరిచేశారు. కానీ, విమానయాన సర్వీసుల్లో, ఎయిర్‌ పోర్టుల్లో జాప్యం కొనసాగుతోంది. ఈ పరిస్థితి కొన్ని రోజులపాటు కొనసాగవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. ఈ పరిస్థితిపై హీత్రూ విమానాశ్రయం సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘విమాన సర్వీసు షెడ్యూల్‌ అమల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో మంగళవారం టికెట్లు బుక్‌ చేసుకొన్నవారు ఎయిర్‌ పోర్టుకు బయల్దేరే ముందు విమానయాన సంస్థను సంప్రదించండి’’ అని వెల్లడించింది. 

ఇక గాట్విక్‌ ఎయిర్‌ పోర్టు మాత్రం మంగళవారం నుంచి సాధారణ షెడ్యూల్‌లో విమానాలను నడపాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తోంది. కానీ, ప్రయాణికులు విమానాల స్టేటస్‌ను ఎయిర్‌లైన్స్‌ వద్ద ధ్రువీకరించుకొని బయల్దేరాలని వెల్లడించింది. లూటన్‌ ఎయిర్‌ పోర్టులో షెడ్యూల్‌ జాప్యాలు నెలకొన్నాయి.

ట్రంప్‌ అభిమానం చూరగొన్న రామస్వామి..!

యూకేలోని నాట్స్‌ (నేషనల్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వీసు) తొలుత ఆటోమేటెడ్‌ ఫ్లైట్‌ ప్లానింగ్‌ సిస్టమ్‌లో సమస్యను సోమవారం మధ్యాహ్నం గుర్తించింది. దాదాపు నాలుగు గంటలపాటు ఇది మొరాయించినట్లు తెలుస్తోంది. దీంతో విమానాల షెడ్యూల్‌ ఆటోమెటిక్‌ వ్యవస్థలో సమస్యలు మొదలయ్యాయి. ఈ కారణంగా సిబ్బంది మాన్యువల్‌గా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జాప్యం మొదలైంది. ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే సరిచేసినట్లు నాట్స్‌ వెల్లడించింది. కాకపోతే విమాన ప్రయాణాలు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, వర్జిన్‌ అట్లాంటిక్‌, టీయూఐ తదితర సంస్థల విమాన ప్రయాణాల్లో జాప్యం నెలకొంది. దీనిపై నాట్స్‌ స్పందిస్తూ.. ‘‘మేము ఈ లోపం కారణంగా ప్రభావిత సర్వీసులను సాధారణ స్థితికి చేర్చేందుకు విమానయాన సంస్థలు, సిబ్బందితో కలిసి పనిచేస్తున్నాం. మా ఇంజినీర్లు జాగ్రత్తగా ఫ్లైట్‌ ప్లానింగ్‌ సిస్టమ్‌ పనితీరును గమనిస్తున్నారు. మేము సాధారణ స్థితికి చేరతాం’’ అని వెల్లడించింది. 

ప్రధాన విమానాశ్రయాల్లో అవస్థలు..

ఫ్లైట్‌ రాడార్‌ 24 ప్రకారం లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో సోమవారం ఒక్క రోజే 142 విమాన సర్వీసులు రద్దు కాగా.. 289 సర్వీసుల్లో జాప్యం నెలకొంది. ఇక గాట్విక్‌ ఎయిర్‌ పోర్టులో 111 విమానాలు రద్దు కాగా.. 253 సర్వీసుల్లో జాప్యం జరిగింది. మొత్తంగా యూకేకు రాకపోకలు జరిపే 1200 విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. దాదాపు మొత్తం మీద 2,00,000 మంది ప్రయాణికులు దీనికి ప్రభావితమై ఉంటారని అంచనా వేస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన ఎకానమీ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ఈజీజెట్‌ మంగళవారం 80 విమానాలను రద్దు చేసింది. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ 60 విమానాలు రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని