Bayraktar: ఇరాన్‌ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్‌.. బైరక్తర్‌ అకిన్సి విశేషాలు..!

తుర్కియే పంపిన అత్యాధునిక బైరక్తర్‌ అకిన్సి డ్రోన్లు ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌ గాలింపులో బాగా ఉపయోగపడ్డాయి. ప్రమాద స్థలం వివరాలను అత్యంత కచ్చితత్వంతో ఇరాన్‌కు అందజేశాయి.  

Updated : 20 May 2024 14:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి, మరికొందరు వీవీఐపీలు ప్రయాణిస్తున్న విమానం నిన్న సాయంత్రం రాడార్‌ నుంచి అదృశ్యమైంది. ఆ తర్వాత పొగమంచు నిండిపోయిన చిక్కటి అడవుల్లో దాని ఆచూకీ గుర్తించడంలో ఇరాన్‌ దళాల శక్తి సరిపోలేదు. దీంతో తుర్కియే సాయం కోరింది. తక్షణమే స్పందించిన అంకారా.. తన అమ్ములపొదిలోని ఓ కీలక డ్రోన్‌ను పంపింది. ఇది రంగంలోకి దిగి కొద్ది గంటల్లోనే కుప్పకూలిన హెలికాఫ్టర్‌ నుంచి వెలువడుతున్న మంటల ఉష్ణం ఆధారంగా ఆచూకీని కనుగొంది. దాని నుంచి సమాచారం అందుకొన్న తక్షణమే ఇరాన్‌ దళాలు ఆ ప్రాంతానికి చేరుకొని అధ్యక్షుడు రైసీ మరణించినట్లు గుర్తించాయి. ఇప్పుడు ఇరాన్‌కు సాయం చేసిన ఆ డ్రోన్‌ వివరాలపై ఆసక్తి నెలకొంది. 

రెండు వైపులా పదునున్న ఫీచర్లు..

తుర్కియే అమ్ముల పొదిలోని కీలకమైన వ్యూహాత్మక డ్రోన్‌ బైరక్తర్‌ అకిన్సి. ఆ దేశం టెక్నాలజీతోనే ఫ్యూజిలాగ్‌ అండ్‌ వింగ్‌ డిజైన్‌లో నిర్మించారు. ఇందులో డ్యూయల్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏవియానిక్స్‌, సెన్సర్‌ ఫ్యూజన్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ వాడారు. ఎయిర్‌ టు ఎయిర్‌ రాడార్‌, సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌, డ్యూయల్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ వంటి అత్యాధునిక ఫీచర్లున్నాయి. భూమిపై, గాల్లోని శత్రువులతో కూడా ఇది పోరాడగలదు. దీనిని తుర్కియే కంపెనీ బైకార్‌ రూపొందించింది.

దాదాపు 20 మీటర్ల పొడవున్న రెక్కలతో రూపొందిన ఈ డ్రోన్‌.. గాల్లో 40,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. రాడార్లు, పేలుడు పదార్థాలు, నిఘా పరికరాలు, ఎలక్ట్రో ఆప్టికల్‌ ఇన్ఫ్రా రెడ్‌ కెమెరాలను తనతోపాటు తీసుకెళ్లగలదు. క్షిపణులు, స్మార్ట్‌ ఆయుధాలను కూడా ఇది ప్రయోగించగలదు. కృత్రిమ మేధ ఆధారంగా కూడా పనిచేసే సామర్థ్యం ఈ డ్రోన్‌కు ఉంది. అత్యంత కఠినమైన ఆపరేషన్లనైనా.. అతి తక్కువ మానవ సాయంతో పూర్తిచేయగలదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని