Electric War: అమెరికా, చైనా ఎలక్ట్రిక్‌ వార్‌!

ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్లో చైనా తిరుగులేని ఆధిపత్యం... ఈ సంఘర్షణకు కారణం! ఇప్పటికే చైనాను సుంకాలతో కట్టడి చేయాలని చూస్తున్న అమెరికా... ఇతర అగ్రదేశాలూ, ఐరోపానూ చైనాతో పోరులోకి దించుతోంది.

Updated : 29 May 2024 09:30 IST

విద్యుత్‌ వాహనాల్లో చైనా ఆధిపత్యం
ఇది ప్రపంచ భద్రతకు ముప్పంటున్న అమెరికా
తాజా జీ-7 మంత్రుల సదస్సులో ఆందోళన
చైనాపై ఆర్థిక ఆంక్షలకు పిలుపు
ఈనాడు ప్రత్యేక విభాగం

యుద్ధాల కాలంలో...
మరో యుద్ధం ఊపందుకుంటోంది.
అదే అమెరికా సారథ్యంలోని పాశ్చాత్య దేశాలకు...
చైనాకు మధ్య ఎలక్ట్రిక్‌ యుద్ధం!

లక్ట్రిక్‌ వాహనాల మార్కెట్లో చైనా తిరుగులేని ఆధిపత్యం... ఈ సంఘర్షణకు కారణం! ఇప్పటికే చైనాను సుంకాలతో కట్టడి చేయాలని చూస్తున్న అమెరికా... ఇతర అగ్రదేశాలూ, ఐరోపానూ చైనాతో పోరులోకి దించుతోంది. తాజాగా ఇటలీలో ముగిసిన జీ-7 దేశాల ఆర్థికమంత్రుల సమావేశంలో చైనా తీరుపై ఆందోళన వ్యక్తమైంది. తక్షణమే మేలుకోకుంటే... తమతమ అంతర్గత ఆర్థిక వ్యవస్థలు, ఉద్యోగాలకే కాకుండా.. ప్రపంచానికీ చైనా ‘అతి’ వల్ల అరిష్టం తప్పదని అమెరికా వాదించింది. చైనాను కట్టడి చేయటానికి చర్యలు తీసుకోవాలని కోరింది. జీ-7లోని ఇతర పాశ్చాత్య దేశాలూ దీనికి అంగీకరించటం గమనార్హం!

2009 నాటికే...

చైనా మాల్‌... అంటే ప్రపంచవ్యాప్తంగా చవక వస్తువులనే పేరు! ఆటవస్తువుల్లోనే కాకుండా... కార్లలాంటి విలాసవస్తువుల్లోనూ అదే ‘చవక బ్రాండ్‌’ కొనసాగించటానికి నిర్ణయించుకున్న చైనా... ఇతర దేశాలకంటే ముందే కళ్లు తెరిచింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ విషయంలో ముందుచూపుతో కదిలింది. వాటికి అవసరమైన ముడిపదార్థాలు కూడా ఆ దేశంలో పుష్కలంగా లభించటం... చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయాలు చైనాకు కలసి వచ్చాయి. 2001లోనే విద్యుత్‌ వాహనాల పాలసీపై ఓ కచ్చితమైన ప్రణాళిక తయారు చేసిన కమ్యూనిస్టు ప్రభుత్వం... 2009కల్లా బీవైడీ, ఎస్‌ఏఐసీ, ఎన్‌ఐఓలాంటి దేశీయ కంపెనీలకు ఆర్థిక సబ్సిడీలు ఇవ్వటం ఆరంభించి... టెస్లాలాంటి కంపెనీలనూ ఆకర్షించింది. 2023లో టెస్లా కంపెనీ తయారు చేసిన ఈవీల్లో సగానికిపైగా చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుంచి వచ్చినవే. 

  • 2023లో ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాల్లో 95% అమెరికా, ఐరోపా యూనియన్, చైనాల్లో జరగ్గా... వాటిలో ఒక్క చైనా వాటానే 60శాతం! ఐరోపాది 25%, అమెరికా 10%! 
  • 2023లో... చైనా కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యంలో 70శాతంకంటే తక్కువ పనిచేసినా... స్వదేశీ మార్కెట్‌ అవసరాలకు మించి ఉత్పత్తి చేశాయి. లాభాలను పెంచుకునేందుకు ఇప్పుడు విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. తాజాగా... అమెరికా పక్కనే మెక్సికోలో ఉత్పత్తి ఆరంభించాలని చైనా కంపెనీ బీవైడీ యోచిస్తోంది. అదే అమెరికా, ఐరోపాలను భయపెడుతోంది. తక్కువ ధరకు లభించే చైనా ఈవీ ఉత్పత్తులు వచ్చిపడితే... అంతర్గతంగా తమ దేశాల్లోని పరిశ్రమలు దెబ్బతింటాయని... తద్వారా ప్రజల ఉపాధి దెబ్బతింటుందనే ఆందోళన మొదలైంది. అందుకే చైనా ఈవీ ఉత్పత్తులపై ఇంతకుముందున్న 25శాతం దిగుమతి సుంకాన్ని 100శాతానికి పెంచాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయించారు. అంతేగాకుండా... ఇలా అవసరానికి మించి చైనా చేస్తున్న అతి ఉత్పత్తి కారణంగా ప్రపంచ భద్రతకూ ముప్పువాటిల్లుతుందని అమెరికా ఆర్థిక మంత్రి ఎలెన్‌ ఆందోళన వ్యక్తంచేయటం విశేషం.

ఐరోపాలో ఆందోళన ఉన్నా...

రోపా యూనియన్‌ కూడా చైనా ఈవీ విధానంపై అధ్యయనం చేస్తోంది. తమకు కలిగే ముప్పుగురించి భయపడుతున్నా... ఐరోపాలోని అన్ని దేశాలూ... చైనాతో సంఘర్షణకు సిద్ధంగా లేవు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న ఐరోపా దేశాలతో చైనా కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. తాయిలాలు వేస్తూ వారిని ఊరిస్తోంది. తాజాగా... జర్మనీలో చైనా కంపెనీ ఒకటి బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీలో భారీగా పెట్టుబడులతో ముందుకొచ్చింది. ఐరోపాలోనే ఇది అత్యంత పెద్దదని చెబుతున్నారు. అడుగుపెట్టడానికి చోటిస్తే... చైనా మొత్తానికే మింగేస్తుందనే భయం యూరోపియన్‌ యూనియన్‌లో లేకపోలేదు. గతంలో వోల్వోను చైనా కంపెనీ అలాగే తినేసిందని గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో... అమెరికాలా తక్షణం... చైనాతో ఘర్షణకు దిగలేని అశక్తత ఈయూ దేశాలది. మొత్తానికి... అటు అమెరికా, ఇటు చైనా ఎలక్ట్రిక్‌ వార్‌లో ఎవరికి వారే పైచేయి సాధించటానికి ఎత్తులు వేస్తున్నారు.


  • సోలార్‌ పీవీలు, పవన విద్యుత్, బ్యాటరీల్లాంటి కార్బన్‌ సాంకేతిక ఉత్పత్తుల్లో 60శాతం; ఎలక్ట్రోలైసర్‌ తయారీ (హైడ్రోజన్‌ ఉత్పత్తి)లో 40%; ప్రపంచ పునరుత్పాదక ఇంధన వాడకంలో 30-35శాతం చైనాదే!
  • ప్రపంచ వ్యాప్తంగా ఈవీల్లో వాడే బ్యాటరీల తయారీలో 83% చైనా చేతుల్లో ఉంది.
  • ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల తయారీలో అత్యంత విలువైన ఖనిజసంపదపై చైనా ఆధిపత్యం అగ్రరాజ్యాలను ఆందోళనలో పడేస్తోంది. 65% లిథియం, 35% నికెల్, 75%పైగా కోబాల్ట్, 90%పైగా శుద్ధ మాంగనీస్, 95%పైగా గ్రాఫైట్‌ చైనా చేతుల్లో ఉంది. 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా అవసరమైన బ్యాటరీ ఉత్పత్తిలో 70శాతం చైనాలోనే తయారవుతోంది.
  • విద్యుత్‌ వాహన వ్యవస్థలోని సప్లయ్‌ చెయిన్‌ చైనా చేతుల్లోనే ఉంది. ఫలితంగా బ్యాటరీ సెల్‌ తయారీకయ్యే ఖర్చు అమెరికాలో కంటే చైనాలో 20% చవక!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని