Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

జపాన్‌(Japan)ను నేడు భారీ భూకంపం వణికించడంతో.. సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. 

Updated : 01 Jan 2024 15:26 IST

టోక్యో: కొత్త సంవత్సరం వేళ.. సోమవారం జపాన్‌(Japan)ను భారీ భూకంపం(earthquake) వణికించింది. రిక్టర్‌ స్కేల్‌పై దాని తీవ్రత 7.6గా నమోదైందని ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో జపాన్‌ వాతావరణ సంస్థ సునామీ(tsunami) హెచ్చరిక జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలంతా ఎత్తయిన సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించింది. 

ఇషికావాకు చెందిన వాజిమా నగర తీరాన్ని ఒక మీటర్‌ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.  అలాగే జపాన్‌ తీరం వెంబడి భూకంప కేంద్రానికి 300కి.మీ పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని హవాయికి చెందిన సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. అవి ఐదు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ భూ ప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా..? అనేది తనిఖీ చేస్తున్నామని హొకురికు ఎలక్ట్రిక్‌ పవర్‌ సంస్థ వెల్లడించింది. 

భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. మొదట 5.7 తీవ్రతతో ఆ ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక దశలో తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.6గా నమోదైందని యూఎస్‌ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

ఈ భారీ భూకంపంతో జపాన్‌తో పాటు ఉత్తర కొరియా, రష్యాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికలను రష్యా అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించింది. జపాన్‌కు సమీపంలో ఉన్న సఖాలిన్ ద్వీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని