China: చైనా ఆక్రమిస్తే.. కిల్‌ స్విచ్‌ ఆన్‌ అవుతుంది: సెమీకండెక్టర్‌ తయారీ సంస్థల ప్లాన్‌..!

చైనాకు షాకిచ్చే ఓ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. బీజింగ్‌ ఏమాత్రం తైవాన్‌ మీదకు కాలు దువ్వినా.. చిప్‌ తయారీ యంత్రాలు వాటంతట అవే నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. 

Published : 21 May 2024 16:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌ను బలప్రయోగం ద్వారా దక్కించుకొని.. చిప్‌ పరిశ్రమను ఏలాలన్న చైనా (China) కలను భగ్నం చేసేందుకు టెక్‌ కంపెనీలు ప్లాన్‌ చేశాయి. ఒకవేళ బీజింగ్‌ తన సైనిక బలంతో దురాక్రమణ చేస్తే.. ప్రపంచంలోనే అత్యాధునిక చిప్‌ తయారీ యంత్రాలు డిజేబులైపోయేలా ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వంలోని ఇద్దరు అధికారులు చెప్పినట్లు  బ్లూమ్‌బెర్గ్‌ పత్రిక కథనంలో పేర్కొంది. 

కొన్నాళ్ల క్రితం అమెరికా ప్రభుత్వం డచ్‌, తైవాన్‌ టెక్‌ సంస్థలతో సమావేశమైంది. ఒకవేళ తైవాన్‌పై చైనా ఆక్రమణ చేపడితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి డచ్‌కు చెందిన ఏఎస్‌ఎంఎల్‌ అధికారులు సమాధానమిస్తూ.. మా ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ముప్పుపై మమ్మల్ని సంప్రదిస్తుందో.. తక్షణమే ఆ యంత్రాలను రిమోట్‌ విధానంలో డిజేబుల్‌ చేసేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఈ దిశగా కొంత కసరత్తు కూడా చేసినట్లు వెల్లడించారు.  మరోవైపు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడేందుకు ఏఎస్‌ఎంఎల్‌, టీఎస్‌ఎంసీ, డచ్‌ వాణిజ్య మంత్రిత్వశాఖ, శ్వేతసౌధం ప్రతినిధి ఇష్టపడలేదు. 

ప్రపంచంలో చిప్‌ల తయారీకి వాడే ఏఎస్‌ఎంఎల్‌కు చెందిన ఎక్స్‌ట్రీమ్‌ అల్ట్రావైలెట్‌ మిషిన్లను ఈయూవీలుగా పేర్కొంటారు. దాదాపు 200 మిలియన్‌ డాలర్ల ఖరీదుతో.. ఒక బస్సు సైజులో ఉండే ఈ యంత్రాలకు తరచూ సర్వీసింగ్‌లు, అప్‌డేట్లు తయారీ కంపెనీ నుంచి వెళుతుండాలి. ఇలాంటి సందర్భాల్లో కంపెనీ దానిని రిమోట్‌ స్విచ్‌ సాయంతో నిలిపివేసే అవకాశం ఉంది.

ఇప్పటికే అమెరికా కోరిక మేరకు చైనాకు అత్యాధునిక చిప్‌ తయారీ యంత్రాలు ఇవ్వకూడదని ఏఎస్‌ఎంఎల్‌ నిర్ణయించింది. వాషింగ్టన్‌ ఒత్తిడి మేరకు డచ్‌ ప్రభుత్వం ఈ ఏడాదే నిర్ణయం తీసుకొంది. దీంతోపాటు ఇప్పటికే స్వీకరించిన ఆర్డర్లలో కూడా కోత విధించింది.  ఈ నిర్ణయంతో దాదాపు 15 శాతం విక్రయాలు తగ్గే అవకాశం ఉందని ఆ కంపెనీ అంచనా వేసుకొంది.

ఏఎస్‌ఎంఎల్‌ యంత్రాలకు తరచూ స్పేర్‌పార్టులు మారుస్తూ, మెయింటెనెన్స్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తులు, పరికరాలు వినియోగించాలి. ఇవి కూడా హాలెండ్‌ నుంచే రావాల్సి ఉంటుంది. చైనా ఆక్రమణ వేళ ఇటువంటి సేవలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. 

మరోవైపు చైనా గతేడాది అమెరికాకు భారీగానే షాకిచ్చింది. యాపిల్‌ ఫోన్లలో వినియోగించే అత్యాధునిక చిప్స్‌ను పాత మోడల్‌ ఏఎస్‌ఎంఎల్‌ యంత్రాలు, అమెరికా నుంచి దిగుమతి చేసుకొన్న కొన్ని టూల్స్‌ వాడి తయారుచేసింది. ఇక హువావే నేతృత్వంలో ఆ దేశం చిప్స్‌ తయారీలో స్వయంసమృద్ధి సాధించడంపై దృష్టిపెట్టింది. ఈ దిశగా ముందడుగు కూడా వేసింది. 

గతేడాది సెప్టెంబర్‌లో టీఎస్‌ఎంసీ అధిపతి మార్క్‌ ల్యూ మాట్లాడుతూ కంపెనీ చిప్‌ మేకింగ్‌ యంత్రాలు పనిచేయకుండా చేసేందుకు ఒక మార్గాన్ని సిద్ధం చేశామన్నారు. టీఎస్‌ఎంసీని ఎవరూ బలవంతంగా నియంత్రించలేరని వ్యాఖ్యానించడం అమెరికా ప్లాన్‌కు అద్దం పడుతోంది.  

గతేడాది చైనాకు చిప్ తయారీ యంత్రాల ఎగుమతి ఆపేస్తున్నట్లు డచ్‌ ప్రకటించింది. జాతీయ భద్రతను దృష్టిలోపెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆ ప్రభుత్వం వెల్లడించింది. వీటిల్లో అత్యంత కీలకమైన ఏఎస్‌ఎంఎల్‌ సంస్థ అభివృద్ధి చేసిన చిప్‌ టెక్నాలజీ కూడా ఉంది. ప్రపంచ చిప్స్‌ తయారీ విభాగంలో ఏఎస్‌ఎంఎల్‌ ముఖ్యమైన సంస్థ. దీంతో ఫోన్ల నుంచి ఆయుధాల వరకు ఉపయోగించే సెమీకండక్టర్ల తయారీలో ముఖ్యమైన దశలపై దీని ప్రభావం తీవ్రంగాఉంది. 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని