Sunita Williams: అంతరిక్ష కేంద్రంలో సునీత డ్యాన్స్‌

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి ప్రవేశించారు.

Published : 08 Jun 2024 06:44 IST

హ్యూస్టన్‌: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి ప్రవేశించారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు సైతం ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక గురువారం విజయవంతంగా ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం గంటకొట్టి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీత ఆనందంతో డ్యాన్స్‌ చేశారు. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్‌ సంస్థ.. తన ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. ఐఎస్‌ఎస్‌లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని సునీత పేర్కొన్నారు. సునీత, విల్‌మోర్‌లు.. ఐఎస్‌ఎస్‌లోని మిగతా వ్యోమగాములతో కలిసి కొన్ని పరీక్షలు, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. 

బోయింగ్‌ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇది తొలి మానవసహిత యాత్ర. అంతకుముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్‌-కంట్రోల్‌ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కాగలిగింది. సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్‌ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు