Gaza: గాజాలో ఆహారం అర్థిస్తున్న వారిపై కాల్పులు.. 20 మంది మృతి!

Gaza: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో తీవ్ర గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. కనీస వసతులు లేక అనేక మంది అల్లాడుతున్నట్లు ఐరాస చెబుతోంది. వారంతా సాయం కోసం వేచి చూస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న ఓ సమూహంపై గురువారం కాల్పులు జరిగినట్లు సమాచారం.

Published : 15 Mar 2024 10:11 IST

గాజా: ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధానికి (Israel Hamas conflict) కేంద్రంగా మారిన గాజాలో మరో ఘోర ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆహారం కోసం వేచి చూస్తున్న సమూహంపై కాల్పులు జరిగినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఈ ఘటనలో కనీసం 20 మంది మరణించారని తెలుస్తోంది. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజాలోని అల్‌ షిఫా ఆసుపత్రి అత్యవసర విభాగంలో పనిచేసే వైద్యుడు మొహమ్మద్‌ ఘ్రాబ్‌ వెల్లడించారు.

ఆసుపత్రికి వస్తున్న క్షతగాత్రులను పర్యవేక్షించడం సాధ్యం కావడం లేదని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. సరైన వసతులు, ఔషధాలు లేవని వెల్లడించింది. యుద్ధ ట్యాంకు లేదా శక్తిమంతమైన తుపాకులతో ఇజ్రాయెల్‌ సైనికులు దాడి చేసి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు అనుమానం వ్యక్తం చేసినట్లు సీఎన్‌ఎన్ తెలిపింది. గాజా ఉత్తర భాగంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని సివిల్‌ డిఫెన్స్‌ అధికార ప్రతినిధి మహమూద్‌ బసల్‌ అన్నారు. వేలాది మంది సామాన్య పౌరులు మానవతా సాయం కోసం వేచిచూస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.

ఫిబ్రవరి 29న సైతం గాజాలో ఇదే తరహాలో దాడి జరిగిన విషయం తెలిసిందే. మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి జరపటంతో పాటు కాల్పులకు దిగడంతో 104 మంది మరణించారు. 760 మంది గాయపడ్డారు. తొలుత వైమానిక దాడి జరిపిన ఇజ్రాయెల్‌ సైన్యం ఆ తరువాత ట్రక్కులవద్ద ఆహార పదార్థాల కోసం ఎగబడిన వారిపై కాల్పులు జరిపిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

200 టన్నుల ఆహారంతో భారీ నౌక..

మరోవైపు దాదాపు 200 టన్నుల ఆహార పదార్థాలతో సిప్రస్‌ నుంచి ఓ భారీ నౌక బయలుదేరినట్లు ఎన్‌జీఓ వరల్డ్‌ కిచెన్‌ సెంటర్‌ తెలిపింది. దాదాపు 60 గంటల్ల్లో అది గాజాకు చేరుకుంటుందని పేర్కొంది. స్వయంగా తమ సిబ్బందే వాటిని పంచి పెడతారని చెప్పింది.

శిథిలాల తొలగింపునకు ఏళ్లు పట్టొచ్చు..

2023 అక్టోబర్‌ 7 హమాస్‌ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన పోరు వల్ల గాజాలో వేలాది భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస తెలిపింది. వాటి శిథిలాలను తొలగించేందుకు ఏళ్లు పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఆయుధ ప్రయోగాల వల్ల శిథిలమైన భవనాల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని ప్రజలను అప్రమత్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని