Japan: జపాన్‌ భూకంపాల్లో పదుల సంఖ్యలో మృతులు.. సునామీ హెచ్చరికల తీవ్రత తగ్గింపు

Japan: జపాన్‌లో నిన్న భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అయితే, సునామీ హెచ్చరికల తీవ్రతను మాత్రం తాజాగా అక్కడి ప్రభుత్వం తగ్గించింది.

Updated : 02 Jan 2024 12:14 IST

టోక్యో: జపాన్‌లో సోమవారం సంభవించిన వరుస భూకంపాల (Japan earthquake) ఘటనల్లో కనీసం 13 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న తీర ప్రాంతం ఇషికావాలో ఈ మరణాలు సంభవించినట్లు తెలిపారు. మరోవైపు జపాన్‌ వాతావరణ సంస్థ నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. అయితే, మరోసారి భూప్రకంపనలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇషికావా ప్రిఫెక్చర్‌లోని పలు నగరాల్లో సునామీ (tsunami) అలలను గుర్తించారు. వాజిమాలో 1.2 మీటర్లు, కనజావాలో 90 సెం.మీ ఎత్తులో అలలు ఎగిసిపడ్డట్లు అధికారులు తెలిపారు. ఓ కూలిన భవనం శిథిలాల నుంచి ఓ వృద్ధుణ్ని బయటకు తీశామని.. కానీ, తర్వాత ఆయన చనిపోయాడని ఇషికావా పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు సైతం మరణించినట్లు వెల్లడించారు.

దాదాపు 50కి పైగా ఇళ్లు కుప్పకూలినట్లు తమకు సమాచారం అందిందని ఇషికావా (Ishikawa) అగ్నిమాపక కేంద్రం వెల్లడించింది. వాటి శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో ఉన్నామని పేర్కొంది. మరో నాలుగు ప్రీఫెక్చర్లలోనూ పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్లు తమకు సమాచారం ఉందని తెలిపింది. మరోవైపు వాజిమా నగర కేంద్రంలో ఉన్న ఓ భవనంలో మంటలు చెలరేగి మరో 50 స్టోర్లు, ఇళ్లకు కూడా అవి విస్తరించినట్లు పేర్కొంది.

తీర ప్రాంతమైన ఇషికావా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల సమయంలో 7.6 తీవ్రతతో భూకంపాలు వరుసగా వచ్చాయని జపాన్‌ వాతావరణ సంస్థ వెల్లడించింది. తర్వాత దాదాపు 100 వరకు స్వల్ప స్థాయి ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. దీంతో జపాన్‌ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. నీటి సరఫరా పైప్‌లైన్లు సైతం దెబ్బతిన్నాయి. విద్యుత్‌ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. బుల్లెట్‌ రైలు సేవలు నిలిచిపోయాయి. మొబైల్‌ సర్వీసులకూ అంతరాయం కలిగింది.

మరోవైపు ఇషికావా ప్రిఫెక్చర్‌లోని షికా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో స్వల్ప స్థాయి పేలుడు సంభవించి, ఏదో కాలిపోతున్న వాసన వచ్చిందని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్తు నిలిచిపోయిందని ఆపరేటర్ చెప్పినట్లు వెల్లడించింది. అయితే బ్యాకప్ సిస్టమ్‌లను ఉపయోగించుకొని రెండు అణు రియాక్టర్‌లు సరిగ్గా పని చేయగలవని తెలిపింది.

జపాన్‌ భూకంప (Japan earthquake) ప్రభావం దక్షిణ కొరియానూ తాకింది. తీర ప్రాంతాల్లో పలు చోట్ల సునామీ అలలను గుర్తించినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోసారి కూడా పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపాయి. మరోవైపు రష్యా, ఉత్తర కొరియాలోనూ తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

తీవ్ర నష్టం వాటిల్లింది: జపాన్‌ ప్రధాని

సోమవారం సంభవించిన భూకంపాల్లో తీవ్ర నష్టం సంభవించినట్లు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా ప్రకటించారు. అనేకమంది ప్రాణాలు కోల్పాయారని వెల్లడించారు. భవనాలు కుప్పకూలాయని, అగ్ని ప్రమాదాలు సంభవించాయని చెప్పారు. సహాయక చర్యలను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అయితే, రహదారులు దెబ్బతినడంతో సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. భవన శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సమయంతో పోటీ పడుతున్నామని వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రభావిత ప్రాంతాలకు వెంటనే నిత్యావసరాలు పంపాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని