Elon Musk: ఎలాన్ మస్క్‌ ఓ ‘పొగరుబోతు బిలియనీర్‌’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌

Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్‌పై దాడికి సంబంధించిన కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్‌ నిరాకరించింది. దీంతో ఎలాన్‌ మస్క్‌పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated : 23 Apr 2024 09:39 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చర్చి బిషప్‌పై జరిగిన కత్తిదాడికి సంబంధించిన పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమం ఎక్స్‌ను (Social Media X) అక్కడి ఫెడరల్‌ కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ (Anthony Albanese), ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.

దాడికి సంబంధించిన పోస్టులపై నిషేధం విధించేందుకు అనుమతించాలంటూ ఆస్ట్రేలియా సైబర్‌ నియంత్రణా సంస్థ ‘ఈ-సేఫ్టీ’ కమిషనర్‌ చేసుకున్న విజ్ఞప్తిని సోమవారం ఫెడరల్‌ కోర్టు అంగీకరించింది. రెండురోజుల పాటు ఆ సంఘటనకు సంబంధించిన కంటెంట్‌ను నిలువరించాలని ‘ఎక్స్‌’ను (Social Media X) ఆదేశించింది. సంఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఉండడం, వాటిపై వివిధ వర్గాల నుంచి కామెంట్లు రావటంతో వాటిని బుధవారం మధ్యాహ్నం వరకు కనిపించకుండా చేయాలని తెలిపింది.

దీనికి స్పందించిన సోషల్‌ మీడియా సంస్థ.. ఆస్ట్రేలియాలోని యూజర్లకు మాత్రమే కంటెంట్‌ను ఆపేసింది. ఆ దేశం వెలుపల ఉండే యూజర్లకు మాత్రం అవి ఇంకా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కంటెంట్‌ను నియంత్రించాలని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది.

‘ఎక్స్‌’ తీరుపై ఆల్బనీస్‌ (Anthony Albanese) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాకు సామాజిక బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తన ప్లాట్‌ఫామ్‌పై హింసాత్మక కంటెంట్‌ను ఉంచేందుకు పోరాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ క్రమంలో మస్క్‌ను ఆయన ‘పొగరుబోతు బిలియనీర్‌’ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనకు తాను చట్టానికి అతీతుడిగా మస్క్‌ భావిస్తున్నారని ఆరోపించారు. ఆస్ట్రేలియా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించామని గుర్తుచేశారు.

ఆల్బనీస్‌ (Anthony Albanese) స్పందించడం కంటే ముందే కోర్టు ఆదేశాలపై మస్క్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ఈ-సేఫ్టీ కమిషనర్‌ను ఆ దేశ సెన్సార్‌షిప్‌ కమిషనర్‌ అంటూ ఎద్దేవా చేశారు. హింసాత్మక కంటెంట్‌ను తొలగించకపోవడం సమంజసం కాదంటూ ఆల్బనీస్‌ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. ‘ఎక్స్‌’ను నిజమైన వాక్‌ స్వాతంత్ర్యానికి వేదికగా ప్రధాని పరోక్షంగా అంగీకరించారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు