Phone: ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి.. 36 గంటలపాటు అందులోనే చిక్కుకుపోయి!

ఫోన్‌ కోసం అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలోకి దిగిన ఓ యువకుడు.. 36 గంటలపాటు అందులోనే చిక్కుకుపోయిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.

Published : 26 Mar 2024 14:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫోన్‌ కోసం అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలోకి దిగిన ఓ యువకుడు అందులోనే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో ఏకంగా ఒకటిన్నర రోజు (దాదాపు 36 గంటల) అక్కడే ఉండిపోవడం గమనార్హం. చివరకు తనను కాపాడాలంటూ కేకలు పెట్టడంతో రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది.. బాధితుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. అయితే, పోలీసులు మాత్రం అతడు ఓ వాహనాన్ని ఢీకొట్టి పారిపోయిన కేసులో నిందితుడిగా అనుమానిస్తున్నారు.

బ్రిస్‌బేన్‌లోని క్యాసిల్‌బార్‌ వీధిలో ఆదివారం నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి అక్కడి అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నుంచి అరుపులు వినిపించాయి. లోనికి చూసి సాయం చేస్తానని అడగగా.. అటువైపు నుంచి వద్దనే సమాధానం వచ్చింది. దాంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు అదే వ్యక్తి అటువైపు వెళ్తుండగా.. ‘రక్షించండి’ అనే కేకలను మళ్లీ విన్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. అతడి శరీరంపై స్వల్ప గాయాలున్నట్లు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడిని విచారించినట్లు క్వీన్స్‌లాండ్‌ పోలీసులు వెల్లడించారు. 

ఫోన్‌ కోసమే అందులోకి దిగినట్లు బాధితుడు చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం తమ వాహనాలను ఓ అనుమానాస్పద కారు ఢీ కొట్టుకుంటూ వెళ్లిందని, అనంతరం డ్రైవర్‌ అందులో దూకి పారిపోయాడని చెప్పారు. ఆ వ్యక్తి ఇతడేనని.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకే డ్రైనేజీలో దాక్కుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అతడు కోలుకున్న తర్వాత పూర్తి విచారణ జరుపుతామన్నారు. ఈ నేపథ్యంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ప్రమాదకరమని, ప్రజలు వాటిపై అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని