Baby Ariha Case: కన్నపేగుకు నిరాశ.. ఆ పాప సంరక్షణ బాధ్యతలు జర్మనీకే!

చిన్నారి అరిహా షా కేసులో ఆమె సంరక్షణ బాధ్యతలను జర్మనీకే అప్పగిస్తూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో పాపను భారత్‌కు తీసుకురావాలన్న ఆమె తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది.

Published : 16 Jun 2023 16:28 IST

బెర్లిన్‌: చిన్నారి అరిహా కేసు (Baby Ariha Case)లో ఆమె తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది! ఆ పాప సంరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో జర్మనీ (Germany) అధికారులకే అప్పగిస్తూ బెర్లిన్‌ (Berlin)లోని ఓ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. చిన్నారికి గాయం ప్రమాదవశాత్తుగా అయ్యిందన్న తల్లిదండ్రుల వాదనను తోసిపుచ్చుతూ.. ఆమె ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించింది. అయితే, తల్లిదండ్రులకు అప్పీల్ చేసుకునే హక్కు ఉందని, ఎప్పటిలాగే పాపను కలవొచ్చని తెలిపింది. కోర్టు తీర్పుపై స్పందించిన చిన్నారి తల్లిదండ్రులు.. పాపను భారత్‌కు తీసుకొచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

ముంబయికి చెందిన భవేష్‌ షా, ధారా షా దంపతులు 2018లో ఉపాధి నిమిత్తం జర్మనీకి వెళ్లారు. అక్కడే వారికి అరిహా షా జన్మించింది. పాప ఆడుకుంటూ కింద పడిపోవడంతో ప్రైవేటు అవయవం వద్ద గాయమైంది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి అయిన గాయం తీరు ఆధారంగా ఆమెపై లైంగికదాడి జరిగి ఉండవచ్చన్న అనుమానాలతో జర్మనీ అధికారులు 2021 సెప్టెంబరులో చిన్నారి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. 20 నెలలుగా ఆమె జర్మనీ అధికారుల కస్టడీలోనే ఉంది. మరోవైపు.. రెండు నెలల్లో భవేష్‌ షా దంపతుల వీసా గడువు ముగిసిపోనుండటంతో పాప కోసం వారు కలత చెందుతున్నారు.

పాపను భారత్‌కు తీసుకొచ్చే విషయంలో చొరవ చూపాలంటూ విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఇటీవల లేఖ రాశారు. భారత ప్రభుత్వం సైతం చిన్నారిని త్వరగా స్వదేశానికి పంపాలని జర్మనీని కోరింది. పాపను అప్పగించాలంటూ 19 పార్టీలకు చెందిన 59 మంది ఎంపీలూ భారత్‌లోని జర్మనీ దౌత్యవేత్తకు లేఖ రాశారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లు అరిహాను తిరిగి తీసుకొస్తారని విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే.. ఈ రోజు నుంచి అరిహాను 140 కోట్ల భారతీయులకు అప్పగిస్తున్నాం’ అని ఆమె తల్లిదండ్రులు తాజాగా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని