Gawadar Port: గ్వాదర్‌ పోర్ట్‌పై బలూచ్‌ మిలిటెంట్ల దాడి.. 8 మంది మృతి

గ్వాదర్‌ పోర్ట్‌పై బలూచ్‌ మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. పాకిస్థాన్‌ భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 8 మంది మరణించారు.

Published : 20 Mar 2024 20:23 IST

కరాచీ: చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ (సీపెక్‌)లో భాగమైన పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్ట్‌పై దాడి జరిగింది. సాయుధులైన బలూచ్‌ తీవ్రవాదులు గ్వాదర్‌ పోర్ట్‌ అథారిటీ కాంప్లెక్స్‌లోకి చొచ్చుకెళ్లి కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు, భద్రతా సంఘటనా స్థలికి చేరుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది తీవ్రవాదులు మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోర్ట్‌పై దాడికి పాల్పడింది తామేనని బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమంటూ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. 

పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్‌గా పిలిచే బలూచిస్థాన్‌ ప్రాంతం అనేక కొండలతో కూడిన ప్రాంతం. స్వాతంత్య్రం కోసం ఇక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి. చైనా- పాకిస్థాన్‌ ఎనకమిక్‌ కారిడార్‌ ప్రాజెక్టులను ఈ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బీఎల్‌ఏ వేర్పాటువాద సంస్థ చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్థాన్‌లోని గ్యాస్, ఖనిజ వనరులను చైనా, పాక్‌ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ (సీపెక్‌)లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని