Women Education: మహిళల విద్యపై అఫ్గాన్‌ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

అఫ్గానిస్థాన్‌లో మహిళల విద్యపై తాలిబన్‌ విదేశాంగ డిప్యూటీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

Published : 08 Dec 2023 12:31 IST

కాబుల్‌: మహిళల విద్యపై అఫ్గానిస్థాన్‌ (Afghanistan) విదేశాంగ డిప్యూటీ మంత్రి షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్జాయ్‌ (Sher Mohmmad Abbas Stanikzai) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల (Talibans)కు ప్రజలు దూరం కావడానికి మహిళల విద్యపై ఆంక్షలు విధించడమే కారణమని తెలిపారు. ఈ మేరకు అఫ్గానిస్థాన్‌ సరిహద్దు మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థుల కోసం నిర్వహించిన స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని టోలో అనే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. బాలికల విద్య కోసం పాఠశాలను తిరిగి తెరవాలని, జ్ఞానం లేని సమాజం చీకటితో సమానమని అబ్బాస్‌ అన్నారు.

‘‘విద్య ప్రతి ఒక్కరి హక్కు. దేవుడు ప్రజలకు కల్పించిన సహజమైన హక్కు. దానిని ప్రజల నుంచి ఎవరైనా ఎలా దూరం చేయగలరు? దీనిని ఎవరైనా అతిక్రమిస్తే.. అది అఫ్గానిస్థాన్‌ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే. విద్యాసంస్థలను తిరిగి అందరి కోసం తెరిచేందుకు ప్రయత్నించాలి. చదవుపై  ఆంక్షల కారణంగానే పొరుగు దేశాలు మనకు దూరం అవుతున్నాయి. మన వల్ల (తాలిబన్లు) దేశం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే.. అందుకు ఇదే కారణం’’ అని అబ్బాస్‌ వ్యాఖ్యానించారు. 

కెనడాలో భారతీయ చిత్రాలు ఆడుతున్న థియేటర్లలో కలకలం

రెండేళ్ల క్రితం అఫ్గానిస్థాన్‌లో పౌర ప్రభుత్వాన్ని కూల్చి, తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ క్రమంలో మహిళలు, బాలికలపై పలు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా దేశంలోని బాలికలు ఆరో తరగతికి మించి చదవాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మహిళల విద్యపై తాలిబన్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని