Banana Artwork: ఆకలేసిందని ఆర్ట్‌ వర్క్‌నే తినేశాడు..!

ఉదయం అల్పాహారం తినని ఓ కుర్రాడు ఆర్ట్‌ మ్యూజియంకు వెళ్లాడు. అక్కడ కనిపించిన అరటిపండును ఏమాత్రం ఆలోచించకుండా తినేశాడు. దాని ఖరీదు 1,20,000 డాలర్లు.

Updated : 01 May 2023 17:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్ట్‌వర్క్‌ మ్యూజియంలో కొన్ని వస్తువులు చూడటానికి సాధారణంగా ఉన్నా వాటి ఖరీదు చాలా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని నెలల క్రితం  అమెరికా(USA)లోని ఓ మ్యూజియంలో గాజుకుక్క బొమ్మను ఓ అవ్వ తాకి చూడబోయింది. పొరబాటున అది కిందపడి రూ.34 లక్షల నష్టం వాటిల్లింది. తాజాగా అటువంటి ఘటనే దక్షిణ కొరియా(South Korea)లో చోటు చేసుకొంది. కానీ, ఇక్కడ సదరు మహాశయుడు కావాలనే ఆర్ట్‌ మ్యూజియంలో ఉన్న దానిని ఆరగించాడు.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో లియూమ్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌లో మౌరిజియో కాటెలాన్‌ అనే ఇటలీ కళాకారుడి ఆర్ట్‌వర్క్‌ను ప్రదర్శించారు. దీనిలో అరటిపండుతో చేసిన ‘కమెడియన్‌’ అనే దానిని ప్రదర్శించారు. గోడకు టేపుతో అతికించారు. ఈ ప్రదర్శన చూడటానికి నోహ్‌ హుయున్‌ సూ అనే విద్యార్థి వచ్చాడు. ప్రదర్శనలో గోడకు అతికించిన అరటి పండును చూడగానే మరో అలోచన లేకుండా దానిని తీసుకొని.. తాపీగా తొక్క ఒలుచుకొని తిన్నాడు. అనంతరం ఆ తొక్కను టేపుతో గోడకు అంటించాడు. విషయం తెలుసుకొన్న మ్యూజియం నిర్వాహకులు అక్కడకు వచ్చి అరటిపండు ఎందుకు తిన్నావని ప్రశ్నించారు. ‘‘ఉదయం అల్పాహారం తినలేదు’’ అని హుయున్‌ సూ వారికి తాపీగా సమాధానం చెప్పాడు. దీంతో చేసేది లేక మ్యూజియం నిర్వాహకులు అతడికి ఎటువంటి జరిమానా విధించకుండా విడిచిపెట్టారు. ఆ ప్రదేశంలో మరో అరటిపండును తీసుకొచ్చి అతికించారు. ఈ ఆర్ట్‌వర్క్‌లో ప్రతి మూడు రోజులకోసారి అరటిపండును మారుస్తుంటారు. వాస్తవానికి నోహ్‌ హుయున్‌ సూ కూడా సియోల్‌ యూనివర్శిటీలో ఆర్ట్‌ మేజర్‌ విద్యార్థి కావడం గమనార్హం. అతడు ఓ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థతో మాట్లాడుతూ తన చర్యలను కూడా ఓ కళగా అర్థం చేసుకోవచ్చని సమర్థించుకొన్నాడు.

‘కమెడియన్‌’ పేరిట చేసిన ఈ అరటి పండు ఆర్ట్‌వర్క్‌ పెద్దగా ఖరీదు ఉండదని మనం అనుకొంటాము. కానీ, 2019లో దీనిని తొలిసారి మియామి బీచ్‌ ఆర్ట్‌ బాసెల్‌లో ప్రదర్శించారు. 1,20,000 డాలర్లు (రూ.98లక్షలు)కు అమ్ముడుపోయింది. అదే ధరకు మరో ‘కమెడియన్‌’ను కూడా తర్వాత విక్రయించారు. ఆ తర్వాత దీని రూపకర్త కాటెలాన్‌ ఈ ఆర్ట్‌వర్క్‌ ధరను 1,50,000 డాలర్లకు పెంచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని