BarkAir: బార్క్ ఎయిర్‌.. ఈ విమానం కేవలం శునకాలకే

BarkAir: శునకాల కోసం బార్క్‌ఎయిర్‌ అనే సంస్థ ప్రత్యేక విమానయాన సేవలను ప్రారంభించింది. దీంట్లో వాటికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. ధర మాత్రం కాస్త ఎక్కువే. ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Updated : 26 May 2024 12:46 IST

BarkAir | ఇంటర్నెట్‌ డెస్క్‌: పెంపుడు శునకాలతో విమాన ప్రయాణమంటే పెద్ద సవాలే. అవి ఎక్కడ భయపడిపోతాయోననే ఆందోళన. పైగా విమానయాన సంస్థల ఆంక్షలు. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ‘బార్క్‌ ఎయిర్‌’ (BarkAir) అనే సంస్థ సిద్ధమైంది. ప్రత్యేకంగా పెంపుడు శునకాల కోసమే విమాన సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి విమానం న్యూయార్క్ నుంచి లాస్‌ ఏంజెల్స్‌కు చేరుకుంది. మొదటి సర్వీసులోనే అన్ని టికెట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. 

బార్క్‌ అనే కంపెనీ శునకాల ఆహారం, ఆటబొమ్మలను తయారు చేసి విక్రయిస్తుంటుంది. ఓ జెట్‌ ఛార్టర్‌ సర్వీస్‌ కంపెనీతో జట్టుకట్టి ‘బార్క్‌ఎయిర్‌’ను (BarkAir) ప్రారంభించింది. ఏప్రిల్‌లో తమ కొత్త సేవలను ప్రకటించింది. ప్రపంచంలో ఇలా శునకాల కోసం ఏర్పాటైన రెండో విమానయాన సంస్థ ఇది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన కే9 జెట్స్‌ అనే ప్రైవేటు సంస్థ ఈ సేవలను తొలిసారి ప్రారంభించింది. శునకాల అవసరాలకు అనుగుణంగా విమానంలో బార్క్‌ ఎయిర్‌ అన్ని వసతులు ఏర్పాటు చేసింది. వాటితో పాటు సంరక్షకులు కూడా ప్రయాణించొచ్చు. అయితే, ఏర్పాట్ల విషయంలో మాత్రం తొలి ప్రాధాన్యం శునకాలకే.

ఇదీ ప్రక్రియ..

ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత గంట ముందు విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. చెక్‌ ఇన్‌ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. క్యూలైన్లు, బోనుల వంటి హడావుడి ఉండదు. విమాన సిబ్బంది అక్కడి నుంచే వారి సేవలను అందిస్తారు. శునకాలకు విమానంలో ఇరుకుగా ఉండొద్దనే ఉద్దేశంతో.. విమాన సామర్థ్యం మొత్తానికి ఎప్పుడూ టికెట్‌ బుకింగ్‌ తీసుకోబోమని బార్క్‌ఎయిర్‌ వెల్లడించింది. 

వసతులివే..

శునకాల కోసం విమానాల్లో ప్రత్యేక క్యాబిన్లు ఉంటాయి. ప్రతీ క్యాబిన్‌లో మ్యూజిక్‌, లావెండర్‌ సెంట్‌తో కూడిన టవళ్లు, సువాసన వెదజల్లే పాత్రలు సహా అవి సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులుంటాయి. సిబ్బంది దగ్గర ‘జస్ట్‌ ఇన్‌ కేస్‌’ పేరిట ప్రత్యేక సంచులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అందులో వాటికి కావాల్సిన ఆహారం, కట్టేసేందుకు తాడు, మలమూత్రాల సంచులు సహా అన్నీ ఉంటాయి. మధ్యలో అవి ఆడుకునేందుకు విమానంలో అనేక బొమ్మలు, ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. 15 శునకాలు, ఒక్కో దానితో ఒక వ్యక్తి ప్రయాణించేలా బార్క్‌ఎయిర్‌ విమానాలను రూపొందించారు. కానీ 10 టికెట్లను మాత్రమే విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. 

ఆహారం.. 

శునకాలకు కావాల్సిన అహారం ఎప్పుడూ విమానంలో సిద్ధంగా ఉంటుంది. ఎక్కగానే నీళ్లు లేదా బోన్‌ బ్రాత్‌ అందజేస్తారు. విమానంలో గాల్లోకి ఎగిరేటప్పుడు, దిగేటప్పుడు అసౌకర్యానికి గురికాకుండా వాటికి ప్రత్యేక స్నాక్స్‌ అందజేస్తారు. ప్రయాణంలోనూ చాక్లెట్లు, బిస్కెట్లు సహా ఇతరత్రా ఆహార పదార్థాలు అందజేస్తుంటారు.

జాగ్రత్తలు..

శునకాలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించి ఉండాలి. గత ఆరు నెలల్లో రేబీస్‌ ప్రబలంగా ఉన్న దేశాల్లో నివాసముండకూడదు. శునకాల పరిమాణం, బ్రీడ్‌ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే, మనుషుల మధ్య ఉన్నప్పుడు శునకాలు ఎలా ప్రవర్తిస్తాయనే విషయాన్ని వాటి యజమానులు ముందే పసిగట్టాలి. తద్వారా నలుగురికి ఇబ్బంది కలిగిస్తాయని భావిస్తే మాత్రం వాటిని విమాన ప్రయాణానికి తీసుకురావొద్దని బార్క్‌ఎయిర్‌ సూచిస్తోంది. శునకంతో పాటు ఒకరు వెంట ప్రయాణించొచ్చు. ఎక్కువ మంది వెళ్లాలనుకుంటే మాత్రం కచ్చితంగా ముందుగా తెలియజేసి టికెట్‌ బుక్‌ చేసుకోవాలి.

టికెట్‌ ధర..      

ప్రస్తుతానికి ఈ సేవలను న్యూయార్క్‌ నుంచి లాస్‌ ఏంజెల్స్‌, న్యూయార్క్‌ నుంచి లండన్‌ మధ్య నడుపుతున్నారు. త్వరలో మరిన్ని మార్గాల్లోనూ ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఈ విమానాల్లో శునకాలను తీసుకెళ్లడం మాత్రం ఖరీదైన విషయమే. న్యూయార్క్‌ నుంచి లాస్ఏంజెల్స్ ఒక శునకం, మనిషి కేవలం వెళ్లడానికే 6,000 డాలర్లు (దాదాపు రూ.4.98 లక్షలు). న్యూయార్క్‌ నుంచి లండన్‌కు ఈ మొత్తం 8,000 డాలర్ల (రూ.6.65 లక్షలు) దాకా ఉంది. గిరాకీ పుంజుకుంటున్న కొద్దీ ధరలను తగ్గిస్తామని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు