Benjamin Netanyahu: మీ పని ఇక ముగిసిపోయింది.. వెంటనే లొంగిపోండి: బెంజమిన్‌ నెతన్యాహు

హమాస్‌ ఉగ్రవాదులు వెంటనే ఆయుధాలను విడిచిపెట్టి తమ బలగాలకు లొంగిపోవాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు హెచ్చరించారు.

Published : 11 Dec 2023 02:17 IST

జెరూసలేం: హమాస్‌(Hamas) ఉగ్రవాదులు వెంటనే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని ఇజ్రాయెల్‌(Israel) ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(Benjamin Netanyahu) హెచ్చరించారు. ‘పాలస్తీనియన్‌ గ్రూప్‌’ ముగింపు దగ్గరపడిందని ఆయన అన్నారు. ఈ మేరకు నెతన్యాహు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘యుద్ధం ఇంకా కొనసాగుతోంది కానీ హమాస్‌ అంతానికి ఎంతో దూరం లేదు. హమాస్‌ ఉగ్రవాదులకు నేను ఒకటే చెబుతున్నాను. వెంటనే లొంగిపోండి’’ అంటూ హమాస్‌ అగ్రనేతలను ఉద్దేశించి నెతన్యాహు అన్నారు. గత కొన్నిరోజులగా పదులు సంఖ్యలో హమాస్‌ ఉగ్రవాదులు తమ బలగాల ఎదుట లొంగిపోయినట్లు ఆయన చెప్పారు. అయితే మిలిటెంట్లు లొంగిపోయినట్లు ఇజ్రాయెల్‌ ఇంతవరకు సాక్ష్యం చూపెట్టలేదు. మరోవైపు తమవారు లొంగిపోయినట్లు వస్తున్న వార్తలను హమాస్‌ తోసిపుచ్చింది. 

హమాస్‌ మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా గత రెండు నెలలకుపైగా గాజా(Gaza)లో భీకర యుద్ధం(Israel-Hamas War) కొనసాగుతోంది. అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందికిపైగా ప్రజలను కిరాతకంగా చంపి, 240 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. మరుసటి రోజు నుంచి ఇజ్రాయెల్‌ వైమానిక, భూతల దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. హమాస్‌ ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటివరకు 17,900 మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. ఓవైపు అంతర్జాతీయంగా కాల్పుల విరమణను చేపట్టాలని ఒత్తిడి వస్తున్నా ఇజ్రాయెల్‌ విరమించడం లేదు. కాల్పుల విరమణ కోసం ఐరాస(UN)లో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని అమెరికా(America) అడ్డుకోవడంతో ఐడీఎఫ్‌ దాడులు తీవ్ర తరం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని