Swimming: ఫలించిన ఆమె పోరాటం.. ఇక అక్కడ మహిళలూ టాప్‌లెస్‌గా ఈతకొట్టొచ్చు..!

జర్మనీ రాజధాని బెర్లిన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ నగరంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా టాప్‌లెస్‌గా ఈతకొట్టేందు (Topless Swimming)కు అనుమతి కల్పించింది. ఈ నిర్ణయం వెనుక ఓ మహిళా పోరాటం ఉంది.

Published : 11 Mar 2023 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్ద దుస్తుల విషయంలో వివక్ష చూపుతున్నారంటూ ఓ మహిళ చేసిన పోరాటానికి అధికారులు దిగొచ్చారు. పబ్లిక్‌ పూల్స్‌ (Public Swimming Pools)లో  పురుషులతో సమానంగా ఇక మహిళలు కూడా టాప్‌లెస్‌ (Topless Swimmimg)గా ఈతకొట్టేందుకు అనుమతి కల్పించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌ (Berlin) నగర అధికారులు ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

బెర్లిన్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ఓ స్థానిక ఓపెన్‌-ఎయిర్‌ పూల్‌లో టాప్‌లెస్‌ (Topless)గా సన్‌బాత్‌ చేసింది. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన అక్కడి సిబ్బంది ఆమెను పూల్‌ నుంచి బయటకు పంపించేశారు. దీంతో ఆమె న్యాయచర్యలకు దిగింది. స్విమ్మింగ్‌ పూల్‌లో దుస్తుల విషయంలో మహిళలకు సమానత్వం కల్పించాలని, పురుషుల్లాగే టాప్‌లెస్‌గా ఉండేందుకు అనుమతినివ్వాలని కోరుతూ సెనేట్‌ అంబుడ్స్‌పర్సన్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. ఆమె వినతిని పరిశీలించిన అధికారులు.. బహిరంగ ఈత కొలనుల వద్ద కొంతమంది వివక్షకు గురవుతున్నారని అంగీకరించారు. ఇకపై బెర్లిన్‌లోని పూల్స్‌కు వెళ్లే అందరు విజిటర్స్‌.. టాప్‌లెస్‌గా ఈతకొట్టేందుకు (Topless Swimming)  అనుమతినిచ్చారు.

అంబుడ్స్‌పర్సన్‌ కార్యాలయం జోక్యంతో.. బెర్లిన్‌లో పబ్లిక్‌ పూల్స్‌ (Public Pools)ను నిర్వహించే బెర్లినర్‌ బేడర్బెట్రీబ్‌ తమ దుస్తుల నిబంధనలను అధికారుల ఉత్తర్వులకు అనుగుణంగా మార్చేసింది. ఇకపై స్విమ్మింగ్‌పూల్స్‌ అందరూ టాప్‌లెస్‌గా ఈత కొట్టొచ్చంటూ కొత్త నిబంధనలు రూపొందించింది. అయితే ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయనే దానిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ.. ఈ నిర్ణయంపై హక్కుల సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికే ఆ దేశంలోని కొన్ని నగరాల్లో పబ్లిక్‌ పూల్స్‌ వద్ద టాప్‌లెస్‌ స్విమ్మింగ్‌కు అనుమతి ఉంది. తాజాగా బెర్లిన్‌ కూడా ఆ జాబితాలో చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని