Biden: గాజాలో ఇజ్రాయెల్‌ అధినేత తప్పు చేస్తున్నాడు: బైడెన్‌

గాజాలో ఇజ్రాయెల్‌ తప్పు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు విమర్శించారు. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని సూచించారు. 

Published : 10 Apr 2024 15:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హమాస్‌ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ‘‘నెతన్యాహూ గాజాలో తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని నేను అంగీకరించను. ఆరు లేదా ఎనిమిది వారాలపాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెలీలను కోరుతున్నాను. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు’’ అని  ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత వారం జరిగిన డ్రోన్‌ దాడిలో అమెరికాకు చెందిన ఎన్జీవో సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. 

జోర్డాన్‌, సౌదీ, ఈజిప్ట్‌ దేశాలు కూడా సహాయం, ఆహారం పంపేలా నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు బైడెన్‌ తెలిపారు. వారు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎటువంటి రాజీ ఉండదని చెప్పారు. మరోవైపు శ్వేతసౌధం స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్‌ కొన్ని చర్యలు తీసుకొందని వెల్లడించింది. కానీ, హమాస్‌ వైపు స్పందన మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదని పేర్కొంది. 

ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అమెరికా, ఐరాస డిమాండ్‌ చేసినవిధంగానే గాజాలోకి సరఫరాలను పెంచామని వివరించింది. తాము వీటికి ఎటువంటి ఆటంకాలను సృష్టించడం లేదని తెలిపింది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కుల సామగ్రిని తరలించినట్లు చెప్పింది. యుద్ధం మొదలైన నాటికి ఇదే అత్యధికమని వెల్లడించింది. 
 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని