Joe Biden: ఆసుపత్రిపై దాడి మిలిటెంట్ల పనేనన్న బైడెన్‌.. తోసిపుచ్చిన హమాస్‌!

సెంట్రల్‌ గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడి ఇజ్రాయెల్‌ చేసింది కాదని, అది మిలిటెంట్ల పనిలాగే కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

Published : 18 Oct 2023 18:01 IST

టెల్‌ అవీవ్‌: సెంట్రల్‌ గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడి ఇజ్రాయెల్‌ చేయలేదని.. అది మిలిటెంట్ల పనేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో ఇదే విషయాన్ని చెప్పానని అన్నారు. ఆసుపత్రిపై దాడి ఘటన తనకెంతో ఆగ్రహం కలిగించిందన్న బైడెన్‌.. హమాస్‌ మిలిటెంట్లపై పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, బైడెన్‌ చేసిన ప్రకటనపై స్పందించిన హమాస్‌.. అమెరికా గుడ్డిగా ఇజ్రాయెల్‌ వైపు మొగ్గుచూపుతోందని పేర్కొంది.

యుద్ధం వేళ.. ఇజ్రాయెల్‌లో అందుకే అడుగుపెట్టా! జో బైడెన్‌

‘గాజాలోని ఆసుపత్రిపై జరిగిన ఘటన నన్నెంతో కలచివేసింది. నాదగ్గర ఉన్న సమాచారం ఆధారంగా.. ఆ దారుణం వేరే బృందం చేసినట్లుగా కనిపిస్తోంది. అది ఇజ్రాయెల్‌ పని కాదు. ఆ దాడికి కారణం ఏంటనే విషయం కచ్చితంగా తెలియదు. హమాస్‌ మిలిటెంట్లు 1300 మందిని చంపారు. వారిలో 31 మంది అమెరికన్లు కూడా ఉన్నారు. హమాస్‌ మిలిటెంట్లు కొందర్ని బందీలుగా చేసుకున్నారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దారుణాలపై అమెరికన్‌ పౌరులు దుఃఖిస్తున్నారు. ఈ పరిణామాలపై వారెంతో ఆందోళన చెందుతున్నారు’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

తోసిపుచ్చిన హమాస్‌..

గాజాలోని ఆసుపత్రిపై దాడికి ఇజ్రాయెల్‌ బాధ్యత కాదని అమెరికా చెప్పడాన్ని హమాస్‌ తోసిపుచ్చింది. అది అవాస్తవమని, కేవలం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకే అలా చెప్పిందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ వైపే అమెరిగా గుడ్డిగా మొగ్గుచూపుతోందంటూ విమర్శలు గుప్పించింది.

ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలి : ఇరాన్‌

హమాస్‌పై దాడులు జరుపుతోన్న ఇజ్రాయెల్‌పై చమురు నిషేధాన్ని విధించి అమలు చేయాలని ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి హసియన్‌ అమీరబ్దుల్లాహియన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ (OIC) సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ రాయబారులను బహిష్కరించడం వీటికి అదనమని చెప్పారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా సంక్షోభం వేళ.. ఓఐసీ సభ్యదేశాలు అత్యవసరంగా బుధవారం నాడు సౌదీలోని జెడ్డాలో సమావేశమయ్యాయి.

ఖండించిన ఐరాస

సెంట్రల్‌ గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడిని ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ జరిపిన దాడి సమర్థించలేనిదని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. తాజాగా గాజా ఆసుపత్రిపై దాడి కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తననెంతో బాధకు గురిచేసిందన్నారు. ఆ ప్రాంత భవిష్యత్తు మొత్తం అనిశ్చితిలో మునిగిపోయిందన్న గుటెరస్‌.. మధ్యప్రాచ్యంలో తక్షణమే మానవతావాద కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు.

చర్చలు జరపాలి : పుతిన్‌

గాజా ఆసుపత్రిపై దాడి భయంకరమైన విపత్తు అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన.. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపిన అనంతరం మాట్లాడారు.  ఆసుపత్రి పేలుళ్లలో వందలాది మంది చనిపోవడం, తీవ్ర గాయాలపాలవడం ఓ విపత్తుగా పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఇదో సంకేతమన్న పుతిన్‌.. చర్చలు, సంప్రదింపులపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని