Bill Gates: మళ్లీ ప్రేమలో పడిన బిల్‌గేట్స్‌..?

మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ (Bill Gates) మళ్లీ ప్రేమలో పడ్డారు. ఒరాకిల్‌ మాజీ సీఈవో, దివంగత మార్క్‌ హర్డ్‌ సతీమణి పాలా హర్డ్‌తో ఏడాది నుంచి ఆయన డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

Published : 10 Feb 2023 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ (Bill Gates) మళ్లీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మెలిందాతో విడాకులు తీసుకున్న ఆయన.. ఏడాది నుంచి ఒరాకిల్‌ దివంగత సీఈవో భార్య పాలా హర్డ్‌(Paula Hurd)తో డేటింగ్‌ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆరు పదుల వయసున్న ఈ జంట ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని కెమెరా కళ్లకు చిక్కడంతో వారిపై  డేటింగ్ ఊహాగానాలకు బలం చేకూరినట్లయ్యింది. వీరిద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతోన్న విషయాన్ని వారి స్నేహితులు కూడా ధ్రువీకరిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ (67) 2021లో ఆయన భార్య మెలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌(Melinda French Gates)తో విడాకులు తీసుకున్నారు. పాలా హర్డ్‌ (60) భర్త ఒరాకిల్‌ సీఈవో మార్క్‌ హర్డ్‌ 2019 అక్టోబర్‌లో క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. పాలా హర్డ్‌కు ఇద్దరు కుమార్తెలు. అయితే, ఏడాది నుంచి బిల్‌గేట్స్‌-పాలా హర్డ్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌లో పక్కపక్కనే కూర్చొని ఆటను వీక్షించారు.

వీరిద్దరు సన్నిహితంగా మెలుగుతున్నట్లు వచ్చిన వదంతులపై స్పందించిన వారి సన్నిహితులు.. ఆ బంధం విడదీయరానిది అంటూ అంతర్జాతీయ వార్త పత్రికలతో పేర్కొన్నారు.  1987లో మైక్రోసాఫ్ట్‌లో బిల్‌గేట్స్‌- మెలిందాల పరిచయం వివాహానికి దారి తీసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని