BORG Drinking: బోర్గ్‌ డ్రింకింగ్‌.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్‌!

BORG Drinking: బోర్గ్‌ డ్రింకింగ్‌ అనే ట్రెండ్‌ అమెరికా కాలేజ్‌ క్యాంపస్‌లలో కనిపిస్తోంది. ఇంతకీ ఏంటిది? ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయో చూద్దాం..!

Updated : 21 May 2024 13:21 IST

BORG Drinking | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో కాలేజ్‌ క్యాంపస్‌లలో ఈ మధ్య బోర్గ్‌ డ్రింకింగ్‌ (BORG Drinking) అనే ప్రమాదకరమైన ట్రెండ్ విస్తరిస్తోంది. ఇది ఒక తాగుడు వ్యసనం. వివిధ హానికర మిశ్రమాలతో తయారుచేసిన ముదురు రంగు పానీయాలు యువతను మత్తులో ముంచెత్తుతున్నాయి. క్రమంగా విస్తరిస్తోన్న ఈ విపరీత పోకడ వారి ఆరోగ్యానికి ముప్పు తెచ్చి పెడుతోంది.

ఏంటీ పానీయం..

బోర్గ్‌ (Blackout Rage Gallons) అంటే గ్యాలన్‌ (సుమారు 3.78 లీటర్లు) సైజు ప్లాస్టిక్‌ పాత్రలో వివిధ మిశ్రమాలను కలిపి చేసిన పానీయం. ఆల్కహాల్‌ అధిక మోతాదులో ఉండే వోడ్కా దీంట్లో ప్రధానం. ఒక గ్యాలన్‌ నీటి బాటిల్‌ను తీసుకొని.. దాన్ని సగం ఖాళీ చేస్తారు. 750 మిల్లీలీటర్ల వోడ్కాను కలుపుతారు. ఆల్కహాల్‌ రుచి తెలియకుండా కొన్ని ఫ్లేవర్స్‌ను వాడతారు. అలాగే హ్యాంగోవర్‌ను నివారిస్తుందనే అపోహతో ఎలక్ట్రోలైట్‌ పౌడర్లనూ కలుపుతున్నట్లు గుర్తించారు. ఇవన్నీ కలిస్తే తియ్యటి, సులువుగా తాగగలిగే పానీయం తయారవుతుంది. కానీ, అది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది.

ఇవీ దుష్పరిణామాలు..

బోర్గ్‌లో (BORG) అధిక మోతాదులో ఉండే ఆల్కహాల్‌ తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. కొందరిలో వాంతులు, ఫిట్స్‌ వంటి ప్రాథమిక లక్షణాలను గుర్తించారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర డీహైడ్రేషన్‌కు దారితీసి ప్రాణాలకే ముప్పు తెస్తోంది. పైగా ఆల్కహాల్‌ రుచి తెలియకుండా కలిపే ఫ్లేవర్లు.. బోర్గ్‌ను అధిక మోతాదులో తీసుకునేందుకు దోహదం చేస్తున్నాయి. దీంతో తెలియకుండానే ఎక్కువ ఆల్కహాల్‌ను తీసుకుంటున్నారు. ఇది దీర్ఘకాలంలో గుండె, మెదడు సంబంధిత సమస్యలకు దారితీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సోషల్‌ మీడియాతో వైరల్‌..

బోర్గ్‌ (BORG) ట్రెండ్‌ ప్రాచుర్యంలోకి రావడానికి సోషల్ మీడియా ప్రధాన కారణం. బోర్గ్‌ను ఎలా తయారు చేయాలి?.. పానీయానికి వివిధ రకాల పేర్లు పెట్టడం లాంటి కంటెంట్‌ టిక్‌టాక్‌ వంటి వాటిల్లో తెగ వైరలైంది. కాలేజ్‌ను బట్టి మిశ్రమాలను మార్చడం కూడా సోషల్‌ మీడియా ట్రెండ్‌కు దోహదం చేసింది. పైగా ఆరోగ్య సమస్యలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ తీసుకునేందుకు ఈ తరం కనిపెట్టిన కొత్త పానీయం అంటూ దీన్ని తెగ హైప్‌ చేశారు.

నివారణ చర్యలు..

2022లో ఈ ట్రెండ్‌ వెలుగులోకి వచ్చింది. క్రమంగా అమెరికావ్యాప్తంగా వ్యాపించింది. దీనిపై స్థానిక ప్రభుత్వాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బోర్గ్‌ వల్ల ఎలాంటి దుష్పరిణామాలుంటాయో కాలేజీల్లో అవగాహన సదస్సులు ప్రారంభించాయి. విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ సెషన్లను ఏర్పాటు చేశాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఇది కొంతవరకు నియంత్రణలోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని