Brazil: బ్రెజిల్‌ ఆర్మీ చీఫ్‌ తొలగింపు..!

బ్రెజిల్‌ ఆర్మీ చీఫ్‌పై వేటు పడింది. ఇటీవల  జరిగిన అల్లర్లలో సైన్యం హస్తం ఉందన్న అనుమానాలు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొంది.

Updated : 22 Jan 2023 11:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రెజిల్‌(Brazil) మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో(Jair Bolsonaro) మద్దతుదారులు రాజధాని  బ్రసిలియాలో సృష్టించిన అల్లర్లపై అధ్యక్షుడు లూలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జూలియో సిజర్‌ డె అర్రుడాను పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసినట్లు ఆ దేశ సైన్యం అధికారిక వెబ్‌సైట్‌ వెల్లడించింది. జూలియో స్థానంలో జనరల్‌ టొమస్‌ మిగ్యూల్‌ రెబెరో పైవాను నియమించినట్లు పేర్కొంది. సైన్యంలోని కీలక వ్యక్తులే అల్లరి మూకలను రాజధానిలోకి అనుమతించారన్న ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకొన్నారు. దీనిపై అధ్యక్షుడు లూలా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఇటీవల కాలంలో అధ్యక్షుడు లూలా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని కొన్ని మార్పులు చేస్తున్నారు. అంతేకాదు ఈ అల్లర్లలో సైన్యం హస్తం ఉందని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వారే ప్రభుత్వ భవనాలను అల్లరి మూకలు ఆక్రమించుకొనేలా తలుపులు తెరిచారని పేర్కొన్నారు. తిరుగుబాటుకు సహకరించిన వారిపై చర్యలు ఉంటాయని వెల్లడించారు.

ఇటీవల జరిగిన బ్రెజిల్‌ (Brazil) ఎన్నికల్లో లూలాకు 50.9 శాతం ఓట్లు లభించగా.. బోల్సొనారోకు 49.1 శాతం వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలను అంగీకరించేందుకు బోల్సొనారో నిరాకరించారు. ఈ క్రమంలోనే జనవరి 8న వేలసంఖ్యలో ఆయన మద్దతుదారులు భద్రతా వలయాలను ఛేదించుకొని దేశ రాజధానిలోని కీలక భవనాల్లోకి చొరబడ్డారు. సైన్యం జోక్యం చేసుకొని బోల్సొనారోకు అధికారం అప్పజెప్పాలని.. లేదా ప్రస్తుత అధ్యక్షుడు లూలాను అధికార పీఠం నుంచి దింపేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని