British Indian: సరదా వ్యాఖ్యలకు బ్రిటిష్‌- ఇండియన్‌ అరెస్టు.. నిర్దోషిగా ప్రకటించిన స్పానిష్‌ కోర్టు

తాను తాలిబన్‌ గ్రూప్‌లో సభ్యుడినని, విమానాన్ని పేల్చేస్తానని స్నేహితులతో సరదాగా వ్యాఖ్యానించి అరెస్టయిన వర్మ అనే 18 ఏళ్ల బ్రిటిష్‌ ఇండియన్‌ విద్యార్థిని స్పెయిన్‌ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.

Published : 27 Jan 2024 21:32 IST

లండన్‌: తాను తాలిబన్‌ సభ్యుడినని, విమానాన్ని పేల్చేస్తానని స్నేహితులతో సరదాగా వ్యాఖ్యానించి అరెస్టయిన వర్మ అనే 18 ఏళ్ల బ్రిటిష్‌-ఇండియన్‌ విద్యార్థిని (British-Indian) స్పెయిన్‌ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. 2022లో ఈ ఘటన జరగ్గా.. తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాదాపు ఏడాదిన్నర క్రితం యూకే నుంచి స్పెయిన్‌ వెళ్తున్న వర్మ.. ‘‘ నేను విమానంలో ఉన్నా. దానిని పేల్చేందుకే వెళ్తున్నా. నేను తాలిబన్‌ గ్రూప్‌ సభ్యుడిని’’ అంటూ సరదాగా స్నాప్‌చాట్‌ ద్వారా స్నేహితులకు మెసేజ్‌ పంపాడు. ఈ విషయం బ్రిటన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ఏజెంట్లకు చేరడంతో వెంటనే స్పెయిన్‌ వైమానిక భద్రత విభాగానికి సమాచారం అందించారు.

అప్రమత్తమైన అధికారులు అధికారులు విమానం గాలిలో ఉండగానే, దానిని రక్షించేందుకు రెండు ఎఫ్‌-18 ఫైటర్‌ జెట్‌లను పంపారు. విమానం ల్యాండ్‌ అయ్యేవరకు దానిని అనుసరించాయి. విమానాశ్రయంలో దిగగానే బాంబు నిర్వీర్య సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. వర్మను  రెండు రోజులపాటు కస్టడీలోనే ఉంచి బెయిల్‌పై విడుదల చేశారు. ఈ కేసుపై పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆధారాలు సమర్పించాల్సిందిగా స్పెయిన్‌ పోలీసులను ఆదేశించింది. ఆరోపణలను రుజువు చేయడంలో వారు విఫలం కావడంతో నిర్దోషిగా ప్రకటించింది. ఒక వేళ ఈ కేసులో దోషిగా తేలితే.. అక్కడి చట్టాల ప్రకారం.. 22,500 యూరోల జరిమానాతోపాటు, ఫైటర్‌ జెట్‌లను పంపేందుకు అయిన ఖర్చు 95,000 యూరోలు చెల్లించాల్సి వచ్చేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని