Justin Trudeau: మహిళా ఎంపీనే తోసిన ప్రధాని.. ట్రూడో చుట్టూ వివాదాలెన్నో..!

Justin Trudeau: భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అయితే, గతంలోనూ ఆయన పలుమార్లు ఇలాంటి వివాదాస్పద ఘటనలతో వార్తల్లో నిలిచారు.

Updated : 19 Sep 2023 16:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని ఆరోపిస్తూ దిల్లీతో ఉద్రిక్తతలను మరింత పెంచారు కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau). ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అయితే, ట్రూడో ఇలా వివాదాల (Controversies)తో వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. 2015లో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుమార్లు ఆయనను వివాదాలు చుట్టుముట్టాయి.  భారత్‌ పర్యటనలో విమర్శలు.. పార్లమెంట్‌లో మహిళా ఎంపీని తోసేయడం ఇలా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.

జీ20 సదస్సులో చేదు అనుభవాలు..

భారత్‌ అధ్యక్షతన ఇటీవల జరిగిన జీ20 సదస్సులో ట్రూడో వ్యవహారశైలి అంటీ ముట్టనట్లు ఉంది. సదస్సు తొలిరోజు నిర్వహించిన విందుకు కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత ప్రపంచ దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించే సమయంలో కూడా ట్రూడో ఎవరితో పెద్దగా కలవలేదు. ఇక, ట్రూడోతో భేటీ అయిన భారత ప్రధాని మోదీ.. భారత్‌ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందడాన్ని ప్రస్తావించడం ఆయనను మరింత ఇబ్బందిపెట్టింది. ఇలాంటి ప్రతికూల సమయంలో విమానంలో సాంకేతిక లోపం కారణంగా సదస్సు ముగిసినా ట్రూడో మరో రెండు రోజులు దిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. ట్రూడో జీ20 పర్యటనపై స్వదేశంలో కూడా విమర్శలు వచ్చాయి. సదస్సులో మిగిలిన దేశాధినేతలు ఆయన్ని పట్టించుకోలేదని.. ఇది అవమానకరమని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

నాటి భారత పర్యటనా వివాదాస్పదమే..

2018 ఫిబ్రవరిలో ట్రూడో కుటుంబం ఎనిమిది రోజుల పాటు భారత్‌లో పర్యటించింది. అయితే, ఆ సమయంలో ట్రూడో భారీగా విమర్శల పాలయ్యారు. అప్పట్లో ఆయన గౌరవార్థం కెనడా హైకమిషన్‌ ఇచ్చిన విందుకు మాజీ ఖలిస్థానీ ఉగ్రవాది జస్పాల్‌ అత్వాల్‌ను ఆహ్వానించారు. ఇది ట్రూడోను దౌత్యపరమైన చిక్కుల్లోకి నెట్టింది. ఈ ఘటనల కారణంగా భారత్‌ ప్రభుత్వం అప్పట్లో ఆయన పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అధికారిక కార్యక్రమాలు తక్కువగా జరిగాయి. పర్యటక ప్రాంతాల సందర్శన కోసం ట్రూడో భారత్‌ వెళ్లినట్లుందని స్వదేశంలో విమర్శలను ఎదుర్కొన్నారు.

ఇక, ఆ పర్యటనలో ఆయన ఎక్కువ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కన్పించారు. భారత అధికారులతో సమావేశాల సమయంలో ఆయన కుర్తా పైజామాలో కన్పించడం విమర్శలకు దారితీసింది. కెనడాలో సిక్కు ఓటర్ల కోసమే ఆయన అలా ప్రవర్తించారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.

నైతిక చట్టాలను పక్కనబెట్టి..

2019లో ట్రూడో ప్రభుత్వం నైతిక చట్టాలను ఉల్లంఘించిందని కెనడా స్వతంత్ర ఎథిక్స్‌ కమిషనర్‌ కార్యాలయం వెల్లడించింది. 2018లో ఎన్‌ఎన్‌సీ లవాలిన్‌ అనే నిర్మాణ సంస్థపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ గ్రూప్‌పై దర్యాప్తు చేపట్టాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు నిర్ణయించారు. అయితే ఈ దర్యాప్తును ట్రూడో ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఎథిక్స్‌ కమిషన్‌ తమ నివేదికలో వెల్లడించింది. దీన్నీ ట్రూడో కూడా అంగీకరించారు. అయితే వేలాది ఉద్యోగాలను కాపాడేందుకే తాను ఆ పని చేసినట్లు చెబుతూ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. నైతిక చట్టాలను ఉల్లంఘించారని నిర్ధారణ అయిన తొలి కెనడా ప్రధాని ఈయనే కావడం గమనార్హం.

ప్రైవేటు దీవిలో వెకేషన్‌..

2016లో ప్రముఖ బిలియనీర్‌ ఆగా ఖాన్‌కు చెందిన ఓ ఎక్స్‌క్లూజివ్‌ దీవిలో ట్రూడో వెకేషన్‌కు వెళ్లారు. అయితే, సొంత ప్రయోజనాల కోసమే ఆయన అక్కడకు వెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. ఆగా ఖాన్‌ ఫౌండేషన్‌.. ట్రూడో, ఆయన ప్రతినిధులకు లాబీ కంపెనీగా నమోదైంది. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణలపై స్పందించిన ట్రూడో.. భవిష్యత్తులో నిబంధనల ప్రకారమే హాలిడే ప్లాన్‌ చేసుకుంటానని చెప్పారు.

ఎల్బోగేట్‌ వివాదం..

2016లో ట్రూడో ఓసారి పార్లమెంట్‌లో అనుచితంగా ప్రవర్తించారు. విపక్ష నేతల ఆరోపణలతో విసిగిపోయిన ట్రూడో.. ఓ ప్రతిపక్ష సభ్యుడిని పట్టుకునేందుకు తన స్థానం నుంచి వేగంగా దూసుకెళ్లారు. ఆ క్రమంలో ఓ మహిళా ఎంపీని ఆయన నెట్టేశారు. ట్రూడో మోచేయి ఆమె ఛాతిని బలంగా తాకింది. దీనిపై పలుమార్లు క్షమాపణలు తెలిపిన ట్రూడో.. ప్రపంచంలోనే అత్యంత ఒత్తిడితో పనిచేస్తున్న వ్యక్తిని తానేనంటూ చెప్పడం గమనార్హం.

ఆందోళనకారిణిపై అవమానకర వ్యాఖ్యలు..

2018లో ట్రూడో ఆధ్వర్యంలో లిబరల్‌ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమం జరిగింది. ఆ సభలో ఓ మహిళ ఆందోళన చేపట్టింది. దేశంలో జీవన స్థితిగతులు దిగజారుతున్నాయని గళమెత్తింది. దీంతో ఆమెను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. అయితే, ఆ సమయంలో ట్రూడో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది కాస్తా వివాదాస్పదం కావడంతో ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు