Justine Trudeau: కెనడా ప్రధాని ట్రూడో విమానం మళ్లీ ఆగిపోయింది..!

Justine Trudeau: కెనడా ప్రధాని ట్రూడో విమానం మరోసారి సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది. అధికారిక విమానం ఆయనను ఇబ్బంది పెట్టడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి.

Updated : 06 Jan 2024 12:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justine Trudeau)ను తన అధికారిక విమానం మరోసారి ఇబ్బందిపెట్టింది. జమైకా పర్యటనలో ఉండగా దీనిలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ప్రధాని స్వదేశానికి తిరిగొచ్చేందుకు వీలుగా మరో విమానాన్ని పంపించినట్లు కెనడా తాజాగా వెల్లడించింది.

ప్రధాని ట్రూడో ఇటీవల కుటుంబంతో కలిసి వెకేషన్‌ నిమిత్తం జమైకాకు వెళ్లారు. జనవరి 2వ తేదీన ఆయన అధికారిక విమానంలో సాధారణ తనిఖీలు చేస్తుండగా సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ఈ సమస్యతో విమానం పనిచేయదని గుర్తించిన భద్రతాసిబ్బంది.. స్వదేశంలోని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ మరుసటి రోజు మరో విమానంలో సాంకేతిక నిర్వహణ బృందాన్ని జమైకాకు పంపించినట్లు కెనడా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ డిఫెన్స్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.

గగనతలంలో ఊడిన డోర్‌.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

వారు మరమ్మతులు చేసిన అనంతరం జనవరి 4న ట్రూడో తన అధికారిక విమానంలో కెనడాకు చేరుకున్నట్లు ఆ ప్రతినిధి తెలిపారు. ప్రధాని ప్రయాణించిన రాయల్‌ కెనడియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సీసీ-144 ఛాలెంజర్స్‌ విమానాన్ని 2020లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇలా సాంకేతిక సమస్య ఎదురవడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబరులో జీ20 సదస్సు నిమిత్తం భారత్‌కు వచ్చిన సమయంలోనూ ఆయన విమానం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో సదస్సు ముగిసినా ఆయన దిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. చివరకు రెండు రోజుల తర్వాత ఆయన కెనడాకు తిరుగుపయనమయ్యారు.

అయితే, కెనడా అధికారిక విమానాలు.. ఆ దేశ ప్రధానిని ఇబ్బంది పెట్టడం ఇదే తొలిసారి కాదు. 2016లో బెల్జియం బయల్దేరిన విమానం సాంకేతిక సమస్యతో తిరిగి కెనడాకే రావాల్సి వచ్చింది. 2019 అక్టోబరులో గోడను పొరబాటున ఢీకొట్టడంతో విమానం ముక్కుభాగం దెబ్బతింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని