Canada: హింసను ప్రోత్సహించడాన్ని ఏమాత్రం ఆమోదించం: కెనడా

వాంకోవర్‌లో ఇందిరాగాంధీ హత్య చిత్రాలను ప్రదర్శించడంపై కెనడా ప్రభుత్వం స్పందించింది.

Published : 09 Jun 2024 12:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హింసను ప్రేరేపించే పనులను ఏమాత్రం ఆమోదించబోమని కెనడా (Canada) ప్రభుత్వం పేర్కొంది. గత వారం వాంకోవర్‌లో కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరాగాంధీ హత్య చిత్రాలను ప్రదర్శించడంపై కెనడా పబ్లిక్‌ సేఫ్టీ మంత్రి డొమనిక్‌ ఎల్‌ లిబ్లెన్స్‌ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.  ‘‘ఇటీవల ఇందిరాగాంధీ హత్య చిత్రాలను వాంకోవర్‌లో ప్రదర్శించారు. హింసను ప్రోత్సహించడాన్ని మేం ఎప్పటికీ ఆమోదించబోం’’ అని డొమనిక్‌ పేర్కొన్నారు.

మరోవైపు ఇండో-కెనడీయన్‌ చట్టసభ సభ్యుడు చంద్ర ఆర్య మాట్లాడుతూ ‘‘వాంకోవర్‌లోని ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. హిందూ కెనడా వాసుల్లో భయాందోళనలు సృష్టించడమే వీరి లక్ష్యం. కొన్నేళ్ల క్రితం బ్రాంప్టన్‌లో చేసిన కుట్రకు  ఇది కొనసాగింపు మాత్రమే. కొన్ని నెలల క్రితం అమెరికాకు చెందిన ఖలిస్థానీ వేర్పాటువాది పన్నూ మాట్లాడతూ కెనడాలోని హిందువులు తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని బెదిరించిన సంగతి తెలిసిందే. వీరు తుపాకుల చిత్రాలను ప్రదర్శిస్తూ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఏమాత్రం చర్యలు తీసుకోకపోతే ఈ వైఖరి దేశానికి ప్రమాదకరంగా మారుతుంది’’ అని హెచ్చరించారు. దేశంలోని శాంతిభద్రతల సంరక్షణ చూసే సంస్థలు తక్షణమే వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

పన్నూ ఖలిస్థానీ వేర్పాటువాదంలో కీలక వ్యక్తి. దీంతోపాటు సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌లో న్యాయ సలహదారుడిగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు కెనడాలో ఖలిస్థానీలను అదుపు చేయాలని భారత్‌ దీర్ఘకాలంగా అభ్యర్థిస్తూ వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని