Canada: 2024లో 4.85 లక్షల మందికి పీఆర్‌!

2024లో 4.85 లక్షల మంది వలసదారులకు శాశ్వత నివాస హోదా కల్పించనున్నట్లు కెనడా ప్రకటించింది.

Published : 02 Nov 2023 18:16 IST

ఒటావా: వలసల సంఖ్యను మరింత పెంచేందుకు కెనడా (Canada) సిద్ధమైంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది 4.85 లక్షల మంది వలసదారులకు శాశ్వత నివాస (PR) హోదా కల్పించనున్నట్లు ప్రకటించింది. 2025 నాటికి ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచుతామని తెలిపింది. ఒకవైపు పెరుగుతోన్న వృద్ధాప్య జనాభా, మరోవైపు కీలక రంగాల్లో కార్మికుల కొరత సమస్యల నడుమ కెనడా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కెనడా దేశాభివృద్ధి, ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో వలసదారులు కీలకమని వలసలు, శరణార్థులు, పౌరసత్వశాఖ మంత్రి మార్క్ మిల్లర్ పేర్కొన్నారు. కెనడాకు సంబంధించి 2024-26 వలసల ప్రణాళిక (Immigration Levels Plan)ను ఆయన విడుదల చేశారు.

‘పెరుగుతోన్న వృద్ధాప్య జనాభాతోపాటు ఆరోగ్య సంరక్షణ, రవాణా, గృహనిర్మాణం వంటి కీలక రంగాల్లో కార్మికుల కొరతను కెనడా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దేశ నూతన ఆవిష్కరణలు, ఆర్థిక వ్యవస్థ, స్థానిక వ్యాపారాలకు కొత్తవారు కీలకం’ అని కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వశాఖ (IRCC) ఓ ప్రకటనలో తెలిపింది. వలసల ప్రణాళిక కింద కెనడా ప్రభుత్వం 2024లో 4.85 లక్షల మందికి శాశ్వత నివాస హోదా కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025లో 5 లక్షలకు పెంచనుంది. 2026 నుంచి 5 లక్షల వద్దే స్థిరీకరించనుంది. దీంతోపాటు తాత్కాలిక నివాసితుల ప్రవేశాల సంఖ్యలోనూ మార్పులు చేపట్టేందుకు వచ్చే ఏడాది చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది.

కెనడాలో వీసా సేవల్ని పునరుద్ధరించనున్న భారత్‌.. ఈ కేటగిరీల్లో మాత్రమే!

ఐఆర్‌సీసీ వివరాల ప్రకారం.. 2022లో కెనడాలో పీఆర్‌ల విషయంలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఒక్క ఏడాదే 1.18 లక్షల మంది భారతీయులు శాశ్వత నివాస హోదా పొందారు. 2022లో మొత్తం 4.37 లక్షల మందికి కెనడా పీఆర్‌ హోదా ఇవ్వగా.. ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులే కావడం గమనార్హం. ప్రభుత్వ అంచనాల ప్రకారం.. కెనడా జనాభా పెరుగుదలలో 98 శాతానికి వలసలే కారణం. వీరి వల్లే 2022లో కెనడాలో రికార్డు స్థాయిలో పది లక్షల జనాభా పెరిగినట్లు అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు