Pakistan: ‘వారి సాయం లేకుండా మనుగడ సాగించలేం’ - పాకిస్థాన్‌ ప్రధాని

ఐఎంఎఫ్‌ సాయం లేకుండా పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించలేదని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు.

Published : 22 Mar 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ (Pakistan).. సహాయం కోసం అంతర్జాతీయ సంస్థలను వేడుకుంటోంది. తమకు బెయిల్‌ఔట్‌ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) తలుపు తట్టింది. ఇలా ఐఎంఎఫ్‌ నుంచి సాయం కోరడం ఇది 24వ సారి కావడం గమనార్హం. ఈ విషయంపై పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ స్పందిస్తూ.. ఆ సంస్థ సాయం లేకుండా పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించలేదని స్పష్టం చేశారు.

ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌ వాటినుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి పైనే ప్రధానంగా ఆధారపడింది. ఇప్పటికే అనేకసార్లు ప్యాకేజీ పొందిన పాక్‌, మరోసారి చేతులు చాచింది. 1.1 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ విడుదలకు సంబంధించి ఐఎంఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిప్రకారం వచ్చే రెండు, మూడేళ్లలో అంతర్జాతీయ సంస్థ సూచించినట్లు పలు కార్యక్రమాలను అమలుచేయాల్సి ఉంటుంది.

అరుణాచల్‌ భారత్‌దే.. చైనాకు తేల్చిచెప్పిన అగ్రరాజ్యం

ఇదే అంశంపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ స్పందించారు. ఐఎంఎఫ్‌ నుంచి మరో ఆర్థిక ప్యాకేజీ లేకుంటే ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించలేదన్నారు. ఎంతోకాలంగా పాతుకుపోయిన నిర్మాణాత్మక సంస్కరణల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలాఉంటే, ఐఎంఎఫ్‌ నుంచి 3 బిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చేందుకు గతేడాది జూన్‌లో పాకిస్థాన్‌తో ఒప్పందం జరిగింది. ఇందులోభాగంగా వచ్చే ఏప్రిల్‌ నాటికి 1.1 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ పాక్‌కు లభించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని