Ramzan Kadyrov: ‘వాగ్నర్‌’ స్థానాన్ని మేం భర్తీ చేస్తాం.. బక్ముత్‌లో పోరుకు సై!

ఉక్రెయిన్‌లోని బక్ముత్‌లో రష్యా కిరాయి సేన ‘వాగ్నర్‌ గ్రూప్‌’ను భర్తీ చేసేందుకు తాము సిద్ధమని చెచెన్‌ నేత రంజాన్‌ కదిరోవ్‌ ప్రకటించారు. బక్ముత్‌లో తమకు అవసరమైన ఆయుధ సామగ్రిని రష్యా సమకూర్చడం లేదని.. దీంతో తాము వెనక్కి వచ్చేస్తామని వాగ్నర్‌ గ్రూప్ చీఫ్‌ ప్రిగోజిన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే.

Published : 07 May 2023 01:51 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఏడాదికిపైగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఒకవైపు కీవ్‌ తదితర నగరాలపై దాడులు జరుపుతోన్న మాస్కో.. మరోవైపు కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్ (Wagner Group) సాయంతో బక్ముత్‌ (Bakhmut) నగరంపై పట్టు సాధిస్తోంది. అయితే, తమకు అవసరమైన ఆయుధ సామగ్రిని రష్యా సమకూర్చడం లేదని వాగ్నర్‌ గ్రూప్ చీఫ్‌ యెవ్జెనీ ప్రిగోజిన్‌ (Yevgeny Prigozhin) ఇటీవల ఆరోపించారు. అక్కడినుంచి తమ బలగాలను వెనక్కి రప్పించి.. ఈ ప్రదేశాన్ని రష్యా సైన్యానికి బదిలీ చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాల నడుమ చెచెన్యా నేత, క్రూరుడిగా పేరున్న రంజాన్‌ కదిరోవ్‌ (Ramzan Kadyrov) కీలక ప్రకటన చేశాడు. బక్ముత్‌లో వాగ్నర్‌ బలగాల స్థానాన్ని భర్తీ చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించాడు.

‘దేశ ప్రయోజనాలు, భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తాం. ఒకవేళ బక్ముత్‌ నుంచి వాగ్నర్‌ బలగాలు వెనక్కి వచ్చేస్తే.. రష్యా కీలక పోరాట విభాగాన్ని కోల్పోతుంది. ఇదే జరిగితే.. ఆ నగరాన్ని స్వాధీనం చేసుకునే దిశగా వాగ్నర్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు మా బలగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని కదిరోవ్‌ పేర్కొన్నాడు. అయితే, ప్రాణనష్టం వాటిల్లకుండా.. తమ, రష్యన్‌ బలగాలు పరస్పర అవగాహన, సహకారంతో ముందుకెళ్లాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. రంజాన్‌ కదిరోవ్‌కు పుతిన్‌ వీరవిధేయుడిగా పేరుంది. చెచెన్యా మాజీ అధ్యక్షుడు అహ్మద్‌ కదిరోవ్‌ కుమారుడే రంజాన్‌ కదిరోవ్‌. 2007 నుంచి చెచెన్‌ రిపబ్లిక్‌ ఇతని గుప్పిట్లోనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు చేదోడువాదోడుగా ఉండేందుకు యత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మేరకు ప్రకటన చేశాడు.

ఇదిలా ఉండగా.. దాదాపు 70 వేల జనాభా ఉన్న బక్ముత్‌ నగరంపై రష్యా గతేడాది నుంచే దాడులు మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఇక్కడ పోరాటం ఆగలేదు. ఇప్పటికే ఈ ప్రాంతంపై రష్యా కిరాయి సేనలు పట్టు సాధించాయి. మే 9 నాటికి పూర్తిగా కైవసం చేసుకుంటామని ఇటీవల ప్రకటించాయి కూడా. ఎంతో కీలకమైన బక్ముత్‌ నగరం ఉక్రెయిన్‌ చేజారితే.. రష్యా బలగాలు మరింత ముందుకెళ్లే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని