China: ‘అరుణాచల్‌’పై చైనా మొండి వాదన.. నెలలో నాలుగోసారి!

అరుణాచల్‌ ప్రదేశ్‌పై చైనా చేస్తోన్న మొండి వాదనలపై భారత్‌ దీటుగా స్పందిస్తున్నప్పటికీ.. డ్రాగన్‌ మాత్రం నోరు అదుపులో పెట్టుకోవడం లేదు.

Published : 25 Mar 2024 19:09 IST

బీజింగ్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌పై మొండి వాదన చేస్తోన్న చైనా (China).. ఇటీవల మరింత నోరు పెంచింది. వాటిని అసంబద్ధమైన, హాస్యాస్పదమైనవంటూ భారత్‌ తోసిపుచ్చుతున్నప్పటికీ.. డ్రాగన్‌ మాత్రం నోరు మూయడం లేదు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (Jaishankar) దీటుగా సమాధానం ఇచ్చిన తరుణంలో చైనా మరోసారి స్పందించింది. అరుణాచల్‌ను భారత్‌ అన్యాయంగా ఆక్రమించుకొందని మరోసారి నోరు పారేసుకుంది.

‘భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నడూ పరిష్కారం కాలేదు. గతంలో అది చైనాలో భాగంగా ఉండేది. ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేది. 1987లో భారత్‌ ఆక్రమించుకొని అరుణాచల్‌ ప్రదేశ్‌గా రూపొందించుకుంది’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ పేర్కొన్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నామని.. దీనిపై చైనా వైఖరిలో మార్పు లేదన్న మొండి వాదనను కొనసాగించారు.

ఇటీవల అరుణాచల్‌లో ప్రధాని మోదీ పర్యటనతో ఉలిక్కిపడిన చైనా.. అది తమ భూభాగమేనని చెప్పడం మొదలుపెట్టింది. ఇలా మాట్లాడటం గత నెల రోజుల్లో ఇది నాలుగోసారి. అయితే, చైనా వ్యాఖ్యలపై భారత్‌ దీటుగా బదులిస్తోంది. ‘ఇది కొత్త విషయం కాదు. చైనా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. తాజాగా వాటిని మరింత పెంచింది. అవి మొదటినుంచీ హాస్యాస్పదంగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే’ అని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇటీవల పేర్కొన్నారు. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌కు చెందిన సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌లో ప్రసంగించిన సమయంలో పలువురు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. వీటిపైనే చైనా మళ్లీ ఇలా స్పందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని