China: చంద్రుడి ఆవలి పక్కకు చైనా కమ్యూనికేషన్ ఉపగ్రహం..!

చంద్రుడిపై పరిశోధనలను బీజింగ్‌ వేగవంతం చేసింది. తాజాగా అక్కడి నుంచి భూమిపైకి కమ్యూనికేషన్లను మెరుగు పర్చేందుకు ప్రత్యేక ఉపగ్రహాలను కూడా ప్రయోగించింది.

Updated : 20 Mar 2024 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చంద్రుడిలోని చీకటి భాగంలోకి చైనా (China) ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీనికి సంబంధించి లాంగ్‌ మార్చ్‌ 8 రాకెట్‌పై క్యూకియావ్‌-2 అనే 1.2 టన్నుల శాటిలైట్‌ను హైనాన్‌ ప్రావిన్స్‌ నుంచి బుధవారం ఉదయం లాంచ్‌ చేసింది. భవిష్యత్తులో చైనా చంద్రుడిపై చేసే ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని భూమిపైకి పంపేందుకు దీనిని వాడనున్నారు. 

సాధారణంగా చంద్రుడిపై మనకు కనిపించే భాగం నుంచి భూమిపైకి డేటా పంపడం సులువు. కానీ, అవతలి భాగం నుంచి కమ్యూనికేషన్లను నెలకొల్పడం అసాధ్యం. తాజాగా ప్రయోగించిన క్యూకియావ్‌-2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ మేలో ప్రయోగించనున్న ఛాంగి-6 మిషన్‌ నుంచి సంకేతాలను భూమిపైకి ప్రసారం చేయాల్సి ఉంటుంది. చాంగి ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి ఆవలివైపు ఉన్న మట్టి ఇతర ఖనిజాలను చైనా సేకరించనుంది. 2026లో ప్రయోగించాలనే లక్ష్యంతో పెట్టుకొన్న చాంగి-7, 2028లోని చాంగి-8కు కూడా ఈ ఉపగ్రహం సహకరించనుంది. అంతేకాదు.. చంద్రుడిపైకి తలపెట్టిన మానవ యాత్రలకు, ఇతర గ్రహాలపై కార్యకలాపాల నిర్వహణలోనూ కమ్యూనికేషన్స్‌ను చైనా దీని నుంచే జరపనుంది. క్యూకియావ్‌ జీవిత కాలం 8 సంవత్సరాలు. 

తాజా ప్రయోగంలోనే టియాండు-1,2 అనే మినీ ఉపగ్రహాలను కూడా పంపింది. ఇవి కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ సమూహాన్ని ఏర్పాటు సాధ్యాసాధ్యాలను వీటి ద్వారా పరీక్షించనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో నిర్మించ తలపెట్టిన పరిశోధనశాలకు ఇవి నేవిగేషన్‌, రిమోట్‌సెన్సింగ్‌, కమ్యూనికేషన్‌ సేవలు అందిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని