US- China: శత్రుదేశానికి సాయం నెపం.. అమెరికా రక్షణ సంస్థలపై చైనా ఆంక్షలు!

తైవాన్‌కు ఆయుధ సాయం చేశాయన్న నెపంతో అమెరికాకు చెందిన రెండు రక్షణ సంస్థలపై చైనా ఆంక్షలు విధించింది.

Published : 11 Apr 2024 22:52 IST

బీజింగ్‌: అంతర్జాతీయ వేదికపై నువ్వానేనా అనే రీతిలో సాగే అమెరికా- చైనాల ఆధిపత్య పోరు నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ భూభాగంగా చెప్పుకొంటున్న తైవాన్‌ (Tiwan)కు ఆయుధ సాయం చేశాయన్న నెపంతో అమెరికా (USA)కు చెందిన రెండు రక్షణ సంస్థలపై బీజింగ్‌ ఆంక్షలు విధించింది. జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్‌, జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్‌లకు సంబంధించిన చైనా (China)లోని ఆస్తులను స్తంభింపజేసింది. దీంతోపాటు ఆయా కంపెనీల మేనేజ్‌మెంట్‌ను దేశంలోకి రాకుండా అడ్డుకట్ట వేసింది.

‘‘చైనా- తైవాన్ ప్రాంతంలో కొనసాగుతున్న అమెరికా ఆయుధ విక్రయాలు.. ‘వన్‌ చైనా’ సూత్రాన్ని, గతంలో బీజింగ్‌- వాషింగ్టన్‌లు రూపొందించిన ఉమ్మడి నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించాయి. మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయి. మా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీస్తున్నాయి’’ అని చైనా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో నిఘా బెలూన్‌ కూల్చివేత ఘటనకు నిరసనగా అగ్రరాజ్యానికి చెందిన లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియన్‌ మిసైల్స్‌, డిఫెన్స్‌ సంస్థలపై తమ మార్కెట్‌లో డ్రాగన్‌ నిషేధం విధించింది.

అత్యంత సమీపానికి అమెరికా-రష్యా శాటిలైట్లు.. తప్పిన పెను ముప్పు

తైవాన్‌ను తమ భూభాగంగా పేర్కొంటున్న చైనా.. ఎప్పటికైనా తమలో కలిపేసుకుంటామని తరచూ బెదిరింపులకు పాల్పడుతోన్న విషయం తెలిసిందే. అయితే.. తైవాన్‌కు అగ్రరాజ్యం దౌత్యపరంగా అండగా నిలుస్తోంది. అదేవిధంగా యుద్ధ విమానాల నుంచి గగనతల రక్షణ వ్యవస్థల వరకు విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు