Spy Balloon: అమెరికాలో చైనా బెలూన్‌ కలకలం.. అసలేంటీ ‘స్పై బెలూన్‌’..?

అమెరికా (America) గగనతలంపై కొన్నిరోజులుగా ఎగురుతోన్న బెలూన్లు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. వీటిని చైనా (China) ప్రయోగించిన నిఘా బెలూన్లని (Spy Balloon) అమెరికా భావిస్తోంది. దీంతో అప్రమత్తమైన అమెరికా రక్షణ విభాగం.. అధ్యక్ష భవనం (White House) నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే యుద్ధవిమానాలతో కూల్చివేసేందుకు సిద్ధంగా ఉంది.

Published : 03 Feb 2023 20:55 IST

వాషింగ్టన్‌: అమెరికా (America) విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ చైనా పర్యటన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్న వేళ.. అగ్రరాజ్యాన్ని ఓ విషయం కలవరపెడుతోంది. కొన్నిరోజులుగా అగ్రరాజ్య గగనతలంపై ఓ చైనా బెలూన్‌ (Chinese Balloon) ఎగరడాన్ని అక్కడి రక్షణ విభాగం పెంటగాన్‌ (Pentagon) గుర్తించింది. కెనడాను దాటుకొని తమ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే దాని కదలికలు కనుగొన్న అమెరికా.. వైట్‌హౌస్‌ నుంచి ఆదేశాలు రాగానే యుద్ధవిమానాలతో కూల్చివేసేందుకు సిద్ధమైంది. అమెరికాలోని అణు స్థావరాలపై నిఘా పెట్టడంతోపాటు కీలక సమాచారాన్ని సేకరించేందుకే చైనా వీటిని ప్రయోగించినట్లు అమెరికా భావిస్తుండగా.. అది వాతావరణ పరిశోధన కోసం పంపిన బెలూన్‌ అని చైనా పేర్కొంది. ఈ తరుణంలో అసలు ఏంటీ నిఘా బెలూన్లు..? ఇవి ఎలా పనిచేస్తాయి?

అత్యంత ఎత్తులో ఎగిరే బెలూన్‌..

సాధారణంగా వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకుగానూ హై ఆల్టిట్యూడ్‌ బెలూన్‌లను ఉపయోగిస్తారు. ఇవి అత్యంత ఎత్తులో ఎగురుతూ వాతావరణ సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తాయి. వీటి మాదిరిగానే వివిధ ప్రాంతాల్లో లక్షిత స్థావరాల సమాచారాన్ని సేకరించేందుకు నిఘా బెలూన్లను ఉపయోగిస్తారు. భూ ఉపరితలం నుంచి సుమారు 24 వేల నుంచి 37 వేల మీటర్ల (80 వేల నుంచి లక్షా 20వేల అడుగులు) ఎత్తులో తిరుగుతూ ఇవి సమాచారాన్ని సేకరిస్తాయి. సాధారణంగా ప్రయాణికుల విమానాలు మాత్రం 12 వేల మీటర్లు (40 వేల అడుగుల) ఎత్తుకంటే ఎక్కువ ఎగరవు. అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా 65 వేల అడుగుల కంటే తక్కువ ఎత్తులోనే తిరుగుతాయి. కేవలం యూ-2 వంటి నిఘా విమానాలు మాత్రమే 80 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి.

శాటిలైట్లతో పోలిస్తే..

అమెరికా వైమానిక విభాగం 2009లో ఇచ్చిన నివేదిక ప్రకారం.. తక్కువ ఎత్తులో ఉండి ఓ ప్రాంతాన్ని స్కాన్‌ చేయడంతోపాటు ఎక్కువ సమయం లక్షిత ప్రాంతంలో ఉండగల సామర్థ్యం ఈ బెలూన్లకు ఉంటుంది. చాలా మెల్లగా ప్రయాణించడం మరో ఉపయోగమనే చెప్పవచ్చు. ఉపగ్రహాలకు ప్రత్యేకంగా వ్యోమనౌక అవసరం. ఇందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కానీ, ఇటువంటి బెలూన్లు మాత్రం తక్కువ ఖర్చుతోనే రూపొందించవచ్చు.

రెండో ప్రపంచ యుద్ధం నుంచే..

స్పై బెలూన్లను వినియోగించడమనేది కొత్తేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధం నుంచే ఇవి వాడుకలో ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం చివర్లోనే నిఘా బెలూన్లను అమెరికా సైన్యం ప్రయోగించింది. అనంతరం ప్రాజెక్టు జెనెట్రిక్స్‌ (Project Genetrix)కు ఇదెంతో ఊతమిచ్చింది. తూర్పు ఐరోపాతోపాటు చైనాలోని కీలక ప్రాంతాల్లో ఈ నిఘా బెలూన్లు ఎగురుతూ.. ఫొటోలతో కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రాజెక్టు జెనెట్రిక్స్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికాపై జపాన్‌ ఇటువంటి బెలూన్లతోనే బాంబులను ప్రయోగించింది. కానీ ఇవి అమెరికా సైనిక ప్రాంతాల విధ్వంసానికి కాకుండా సాధారణ పౌరుల మరణానికి కారణమయ్యింది.

రక్షణ స్థావరాలే లక్ష్యంగా..

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన మోంటానా తక్కువ జనసాంద్రత కలిగి ఉంది. అమెరికాలో ఉన్న మూడు భూగర్భ అణు క్షిపణి స్థావరాల్లో ఒకటైన మాల్మ్‌స్ట్రోమ్‌ వైమానిక స్థావరం ఇక్కడే ఉంది. ఈ నిఘా బెలూన్‌ దానిపై నుంచి ఎగిరి ఉంటుందని అమెరికా భావిస్తోంది. అయినప్పటికీ దీని ద్వారా కీలక సమాచారం పెద్దగా బహిర్గతం అవుతుందని అనుకోవడం లేదని అమెరికా అంచనా వేస్తోంది. దీన్ని కూల్చేస్తే శకలాలు నేలపై పడి పౌరులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ అంశంపై అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు తమ బెలూన్లపై వార్తలు వస్తుండటంపై చైనా స్పందించింది. అది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన ‘ఎయిర్‌షిప్‌’ అని ప్రకటించింది. అయితే, గాలుల కారణంగా లక్షిత ప్రాంతాన్ని దాటి వచ్చిందని.. అమెరికా గగనతలంలోకి రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని