Maldives-China: భారత్‌తో వివాదం వేళ.. మాల్దీవులకు చైనా ‘ఉచిత’ సాయం

Maldives-China: మాల్దీవులకు ఉచితంగా సైనిక సహకారాన్ని అందించేందుకు చైనా ముందుకొచ్చింది. దీనిపై ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది.

Published : 05 Mar 2024 10:31 IST

మాలె: భారత్‌ (India), మాల్దీవుల (Maldives) మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొనడంతో ఈ ద్వీపదేశానికి మరింత దగ్గరయ్యేందుకు చైనా (China) ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలోనే మాల్దీవులకు ఉచితంగా సైనిక సహకారం అందించేందుకు డ్రాగన్‌ ముందుకొచ్చింది. దీనిపై ఇరు దేశాలు తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. తమ దీవుల నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు డెడ్‌లైన్‌ విధించిన కొన్ని వారాలకే ఈ ఒప్పందం జరగడం గమనార్హం.

మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్‌ ఘాసన్‌తో చైనా మేజర్‌ జనరల్‌ జాంగ్‌ బావోకున్‌ సోమవారం మాలెలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునే అంశంపై చర్చలు జరిపారు. అనంతరం మాల్దీవులకు సైనిక సహకారం అందించే ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వివరాలను రెండు దేశాలు బయటకు వెల్లడించనప్పటికీ.. ఈ సైనిక సహకారాన్ని డ్రాగన్‌ ఉచితంగా అందించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

చైనా ఆర్థికాభివృద్ధిపై నీలినీడలు

చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహమ్మద్‌ ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మాల్దీవులు, భారత్‌ మధ్య దూరం పెరిగింది. తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10నాటికి ఉపసంహరించుకోవాలని డెడ్‌లైన్‌ విధించారు. ఈ క్రమంలోనే సైనిక దళాలను వెనక్కి పిలిపిస్తున్న భారత్‌.. వారి స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బంది (Technical Personnel)ని ఆ దీవుల్లో భర్తీ చేయనుంది.

ఈ పరిణామాల వేళ.. చైనా ఉచితంగా సైనిక సహకారం అందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల చైనా పరిశోధక నౌక మాలె తీరంలో లంగరు వేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఆ దేశ సైనిక ప్రతినిధుల బృందం మాల్దీవుల్లో పర్యటించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని