Xi Jinping: జెలెన్‌స్కీకి చైనా అధ్యక్షుడు ఫోన్‌.. దురాక్రమణ మొదలైన తర్వాత తొలిసారి..!

ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) ఏడాదిగా రష్యా కొనసాగిస్తున్న దురాక్రమణ తరుణంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో మాట్లాడారు.

Published : 26 Apr 2023 20:48 IST

బీజింగ్‌: ఉక్రెయిన్‌-రష్యా (Ukraine Crisis) మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమేనంటూ చైనా (China) కొంతకాలంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా సంక్షోభానికి రాజకీయ పరిష్కార మార్గాన్ని కనుగునేందుకు చర్చలే అనువైన మార్గమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Xi Jinping) ఉక్రెయిన్‌కు సూచించారు. వొలొదిమిర్‌ జెలెన్‌స్కీతో (Zelenskyy) ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. అణుయుద్ధంలో విజేతలెవ్వరూ ఉండరని హెచ్చరించినట్లు చైనా అధికారికంగా వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలైన తర్వాత జెలెన్‌స్కీకి జిన్‌పింగ్‌ ఫోన్‌ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

‘అణుయుద్ధంలో విజేతలెవ్వరూ ఉండరు. ఈ విషయంలో ఇరు వర్గాలు ప్రశాంతంగా ఉంటూ.. నిగ్రహంతో సమస్యను పరిష్కరించుకోవాలి. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని.. తదనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకొని వ్యవహరించాలి. మానవత్వంతో ముందుకెళ్తూ సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం చర్చలు ఒక్కటే ఆచరణీయమైన మార్గం’ అని  జిన్‌పింగ్‌ చెప్పినట్లు  చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఈ సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుక్కునే విషయం గురించి మాట్లాడేందుకు చైనా తరఫున ప్రత్యేక ప్రతినిధిని ఉక్రెయిన్‌కు పంపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది. ఈ విషయంపై స్పందించిన ఉక్రెయిన్‌.. సుమారు గంటపాటు జిన్‌పింగ్‌తో జెలెన్‌స్కీ సంభాషించినట్లు తెలిపింది.

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న యుద్ధంపై చైనా మొదటినుంచి తటస్థంగా ఉంటోంది. దీనిపై రష్యాను ఇప్పటివరకు ఖండించలేదు. కేవలం చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని చెబుతోంది. దీంతో పాశ్చాత్య దేశాల నుంచి చైనాపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల రష్యాలో పర్యటించిన జిన్‌పింగ్‌.. పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా తమకు అత్యంత మిత్రదేశమంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని