South China Sea: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు.. ఫిలిప్పీన్స్‌ శాస్త్రవేత్తల నౌకను అడ్డుకున్న చైనా

దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ శాస్త్రవేత్తలతో వెళుతున్న ప్రభుత్వ నౌకలను చైనా కోస్టుగార్డ్‌ నౌక అడ్డుకుంది. 

Published : 22 Mar 2024 18:59 IST

మనీలా: దక్షిణ చైనా సముద్రం (South China Sea)లో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం ఫిలిప్పీన్స్‌ (Philippine)కు చెందిన శాస్త్రవేత్తల బృందంతో ఉన్న నౌకను సైనిక హెలికాఫ్టర్‌తో కలిసి చైనా కోస్ట్‌గార్డ్‌ నౌక అడ్డుకుంది. దీంతో కొన్ని గంటలపాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి చెందిన ఈ నౌకలు సముద్రంలోని ఇసుక దిబ్బల ప్రాంతంలో పరిశోధనల కోసం శాస్త్రవేత్తలను తీసుకెళుతున్నట్లు ఆ దేశ ప్రతినిధి తెలిపారు. నౌకకు దగ్గరగా వచ్చి తమను అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. కాగా, ఈ ఆరోపణలను చైనా ఖండించింది. 

దక్షిణ చైనా సముద్రజలాల్లో ఉండే ఇసుక దిబ్బల ప్రాంతంలో 34 మంది ఫిలిప్పీన్స్ దేశస్థులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చైనా కోస్ట్‌గార్డ్‌ గుర్తించింది. వారిని అక్కడినుంచి వెళ్లిపోవాలని పలుమార్లు హెచ్చరించినట్లు చైనా అధికారి గాన్‌ యు తెలిపారు. ఆయన వ్యాఖ్యలను ఫిలిప్పీన్స్ తోసిపుచ్చింది. ‘‘చైనా కోస్టుగార్డు మరో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. సుమారు 4 గంటల పాటు మా నౌక సమీపానికి వచ్చి హారన్‌ మోగిస్తూ, సైనిక హెలికాఫ్టర్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మా శాస్త్రవేత్తల పరిశోధనను అడ్డుకున్నారు’’ అని ఫిలిప్పీన్స్‌ కోస్ట్‌గార్డ్‌ ప్రతినిధి జైటర్రీలా తెలిపారు. 

గత ఏడాదిగా దక్షిణ చైనా సముద్ర తీరంలో ఫిలిప్పీన్స్‌-చైనా మధ్య వివాదం తీవ్రమైంది. ఈనెల మొదట్లో ఇరుదేశాల కోస్ట్‌గార్డ్‌ నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మనీలాకు చెందిన నౌక స్వల్పంగా దెబ్బతింది. వరుస ఘటనల నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌కు అమెరికా మద్దతు పలికింది. ఆ దేశ సైనికులు, విమానాలు, నౌకలపై చైనా దాడి చేస్తే సహించేది లేదని, తన వ్యూహాత్మక మిత్ర దేశానికి అండగా వస్తానని ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని