China: కెనడా హెలికాప్టర్‌పై నిప్పుల వర్షం కురిపించిన చైనా ఫైటర్‌జెట్‌..!

చైనా మరోసారి దక్షిణ చైనా సముద్రంలో కెనడాను కవ్వించింది. కెనడాకు చెందిన ఓ సబ్‌ మెరైన్‌ హంటింగ్‌ హెలికాప్టర్‌ను వేధించింది. ఒక దశలో నిప్పులు కురిపించింది.   

Published : 03 Nov 2023 16:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ జలాల్లో చైనా విమానాలు మరోసారి కెనడాను కవ్వించే చర్యలు చేపట్టాయి. దక్షిణ చైనా సముద్రంలో కెనడాకు చెందిన ఓ సైనిక హెలికాప్టర్‌పై బీజింగ్‌ ఫైటర్‌ జెట్‌ నిప్పులను (ఫ్లేయర్లు) కురిపించింది. గత ఆదివారం ఓ ఆపరేషన్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు కెనడా అధికారులు వెల్లడించినట్లు సీఎన్‌ఎన్‌ సంస్థ పేర్కొంది.

‘‘ఆ స్థాయిలో నిప్పులు కురిపించడంతో అవి హెలికాప్టర్‌ బ్లేడ్లు లేదా ఇంజిన్‌కు తాకే ప్రమాదం ఉంది. ఇది ప్రమాదకరమైన చర్య’’ అని రాయల్‌ కెనడియన్‌ నేవీకి చెందిన మేజర్‌ రాబ్‌ మిల్లెన్‌ పేర్కొన్నారు. కెనడాకు చెందిన హెచ్‌ఎంసీఎస్‌ ఒట్టావా నౌకకు చెందిన హెలికాప్టర్‌పై చైనా దుశ్చర్యకు పాల్పడింది. గతంలో కూడా ఒక సారి ఇలాంటి ఘటనే చోటు చేసుకొంది. 

గాజా గగనతలంలో అమెరికా డ్రోన్లు.. బందీల కోసం గాలింపు

అక్టోబర్‌ 29వ తేదీన కెనడా నౌక అంతర్జాతీయ జలాల్లో ఉండగా.. దానికి సంబంధించిన హెలికాప్టర్‌పైకి చైనా నేవీకి చెందిన జె-11 విమానం దూసుకొచ్చింది. ఈ రెండింటి మధ్య కేవలం 100 అడుగుల దూరం మాత్రమే ఉందని కెనడా అధికారులు వివరించారు. కెనడాకు చెందిన హెలికాప్టర్‌ సబ్‌మెరైన్ల గాలింపు ఆపరేషన్‌లో ఉండగా దక్షిణ చైనా సముద్రంలోని పరాసల్‌ ద్వీప సమూహానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ఇటువంటి అవాంతరాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అనే అంశంపై తమ సిబ్బందికి తగిన శిక్షణ ఉందని కెనడా అధికారి వెల్లడించారు. తమ హెలికాప్టర్‌ అంతర్జాతీయ జలాలపైనే ఎగిరిందని పేర్కొన్నారు.

ఇటీవల దక్షిణ చైనా సముద్రం మీదుగా తమ స్ట్రాటజిక్‌ బాంబర్‌కు అత్యంత సమీపం నుంచి చైనా యుద్ధ విమానం  ప్రయాణించిందని అమెరికా వెల్లడించింది. చైనా పైలట్‌ చర్య రెండు విమానాలను ప్రమాదంలోకి నెట్టిందని దుయ్యబట్టింది. ఈ ఘటనపై యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. ‘‘రాత్రి సమయంలో జే-11 యుద్ధ విమానం.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానానికి అత్యంత దగ్గరగా ప్రయాణించింది. మా బీ-52 స్ట్రాటజిక్‌ బాంబర్‌కు కేవలం 10 అడుగుల దూరం లోపలే అనియంత్రిత వేగంతో కిందకు, ముందుకు వెళ్తూ కన్పించింది’’ అని అమెరికా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని