China: చైనా చమురు ట్యాంకర్‌పై హూతీల దాడి..!

తాము చైనా నౌకలపై దాడి చేయమని.. అవి స్వేచ్ఛగా ఎర్ర సముద్రంలోకి రావచ్చని కొన్నాళ్ల క్రితమే హూతీలు ప్రకటించారు. కానీ, కొన్ని రోజుల్లోనే చైనా చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి చేశారు.

Published : 24 Mar 2024 13:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై హూతీలు బాలిస్టిక్‌ క్షిపణితో దాడి చేశారు. ఈ ఘటన శనివారం ఎర్ర సముద్రంలో చోటు చేసుకొంది. అమెరికాకు చెందిన సెంట్రల్‌ కమాండ్‌, యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ దీనిని ధ్రువీకరించాయి. ఈ దాడి కారణంగా నౌకలో మంటలు ఎగసినట్లు పేర్కొన్నాయి. కానీ, వేగంగా స్పందించి అర్ధగంటలోనే వీటిని ఆర్పేశారు. 

‘‘మార్చి 23న ఎర్ర సముద్రంలో హూతీ తిరుగుబాటుదారులు ఎంవీ హువాంగ్‌ పు నౌకపై యాంటి షిప్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ను ప్రయోగించారు. ఈ ఓడ పనామా పతాకంతో ప్రయాణిస్తోంది. ఇది చైనాకు చెందిన సంస్థ యాజమాన్యంలోని ఆయిల్‌ ట్యాంకర్‌. సాయంత్రం 4.25 సమయంలో ప్రమాదంలో ఉన్నట్లు ఇది సంకేతాలు పంపింది. ఈ దాడిలో నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది’’  అని సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. ఈ నౌక భారత్‌లోని మంగళూరుకు వెళుతోంది. యెమెన్‌ నౌకాశ్రయం మోఖా నుంచి 23 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. మరోవైపు హూతీలు ప్రయోగించిన ఆరు డ్రోన్లను తాము కూల్చేసినట్లు అమెరికా ప్రకటించింది.  

చైనా, రష్యా నౌకలను లక్ష్యంగా చేసుకోమని ఇటీవలే హూతీలు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజుల్లో చైనా నౌకపై క్షిపణి దాడి చేయడం గమనార్హం. ఈ నౌక పేరు, యాజమాన్యం ఇటీవలే మారాయి. గతంలో దీనిని బ్రిటన్‌కు చెందిన యూనియన్‌ మారిటైమ్‌ సంస్థ నిర్వహించేది. 

భారత నౌకాదళ చీఫ్‌ ఆర్‌ హరికుమార్‌ శనివారం మాట్లాడుతూ ఎర్ర సముద్రంలో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని పేర్కొన్నారు. దిల్లీలో కొత్తగా నిర్మితమైన నౌసేనా భవన్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మనదేశ జెండా ఉన్న ఏ నౌకనూ హూతీలు లక్ష్యంగా చేసుకోలేదని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు