Iran: ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌కు సిగ్నల్‌ వ్యవస్థే లేదా..?

ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన హెలికాప్టర్‌లో సిగ్నల్‌ వ్యవస్థ కూడా లేకపోయి ఉండొచ్చని తుర్కియే అనుమానం వ్యక్తం చేసింది. 

Published : 21 May 2024 16:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌ (Iran) అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన బెల్‌ 212 హెలికాప్టర్‌కు సిగ్నల్‌ వ్యవస్థ ప్రధాన లోపంగా కనిపిస్తున్నట్లు తుర్కియే రవాణశాఖ మంత్రి అబ్దుల్‌ ఖదీర్‌ వ్యాఖ్యానించారు. ‘ఆ లోహ విహంగంలో సిగ్నల్‌  వ్యవస్థ ఆన్‌ కాలేదు.. అసలు అటువంటి వ్యవస్థే దానిలో లేకపోయుండాలి’ అని తెలిపారు. తుర్కియేకు చెందిన బైరక్తర్‌ డ్రోన్‌ పాల్గొంది. ఇదే ప్రమాదస్థలాన్ని తొలుత గుర్తించింది. 

‘‘మేము హెలికాప్టర్‌ సిగ్నల్‌ కోసం మొదట తీవ్రంగా ప్రయత్నించాము. కానీ మాకు ఎటువంటి ఆధారం లభించలేదు. సాధారణంగా మేము ఇలాంటి ఆపరేషన్లలో వాటి కోసం వెతుకుతాము. రైసీ, వీవీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లకు కచ్చితంగా అటువంటి వ్యవస్థ ఉండాలి’’ అని వెల్లడించారు. 

ఇక ఇరాన్‌ విదేశాంగశాఖ మాజీ మంత్రి జావెద్‌ జారిఫ్‌ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ స్పందించారు. ‘‘అంతిమంగా 45 ఏళ్ల నాటి హెలికాప్టర్‌ను ఉపయోగించాలనుకోవడం అనేది ఇరాన్‌ నిర్ణయం. అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ప్రయాణించారు. ఇందులో మరొకరి పాత్ర లేదు’’ అని తేల్చి చెప్పారు. అంతకుముందు జారిఫ్‌ స్పందిస్తూ తమ హెలికాప్టర్లకు అవసరమైన విడి భాగాలు కొనుగోలు చేయనీయకుండా అమెరికా విధించిన ఆంక్షలే అధ్యక్షుడి ప్రాణాలను బలితీసుకొన్నట్లు ఆరోపించారు. 

విమానాలు, హెలికాప్టర్ల నిర్వహణ లోపాల కారణంగా 1979 నుంచి ఇరాన్‌లో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రక్షణ, రవాణాశాఖ మంత్రులు సహా పలువురు కమాండర్లు మరణించిన ఘటనలూ ఉన్నాయి. ఆదివారం కూలిన బెల్‌ 212 హెలికాప్టర్‌ను 1979 నాటి ఇస్లామిక్‌ విప్లవానికి ముందు ఇరాన్‌ చివరిరాజు షా మహ్మద్‌ రెజా పహ్లావీ హయాంలో సమకూర్చుకొని ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు